నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి
  • కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​లో మంత్రి పొంగులేటి శ్రీ‌‌నివాస్​రెడ్డి
  • ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల అప్లికేషన్ల వడపోత
  • ఈ నెల 31లోగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ​
  • 15, 16 తేదీల్లో జ‌‌రిగే గ్రూప్-2కు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆర్డర్స్​

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల ద‌‌ర‌‌ఖాస్తుల ప‌‌రిశీల‌‌న‌‌ను పకడ్బందీగా చేప‌‌ట్టాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీ‌‌నివాస్​ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ద‌‌ర‌‌ఖాస్తుల ప‌‌రిశీల‌‌న, గ్రూప్ -2 ప‌‌రీక్షల నిర్వహ‌‌ణ‌‌, మెస్ ఛార్జీల‌‌పెంపు, కులగణన త‌‌దిత‌‌ర అంశాల‌‌పై బుధవారం సెక్రటేరియెట్​లో సీఎస్​ శాంతి కుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల ప‌‌రిశీల‌‌న‌‌ను ఈ నెల 31లోగా పూర్తిచేయాలని సూచించారు. వివ‌‌రాలను యాప్‌‌లో నమోదు చేయాలని, ప్రతి 500 దరఖాస్తుల సర్వే బాధ్యతలను ఒక ఉద్యోగికి అప్పగించాలన్నారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులనూ భాగ‌‌స్వామ్యం చేయాలన్నారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు వేయించాలన్నారు.

సర్వే వివరాలపై రోజూ కలెక్టర్లు సమీక్షించాలని, జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాలకోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందిర‌‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌‌ర ప్రక్రియ అని, ఈ ఏడాది 4.5 ల‌‌క్షల ఇండ్లను నిర్మించ‌‌బోతున్నామని మంత్రి చెప్పారు. 

14న హాస్టల్ విద్యార్థులతో స‌‌హ‌‌పంక్తి భోజ‌‌నం

ఏడాది కాలంలోనే హాస్టల్​ విద్యార్థులకు 40 శాతం మెస్​చార్జీలు పెంచుతూ కీల‌‌క నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఈ నిర్ణయంతో 7 లక్షల 65 వేల మంది విద్యార్దుల‌‌కు ప్రయోజ‌‌నం కలుగుతున్నదన్నారు. క‌‌లెక్టర్లు త‌‌ర‌‌చూ హాస్టళ్లను త‌‌నిఖీ చేసి స‌‌రుకుల క్వాలిటీని పరిశీలించాలన్నారు. ఈ నెల 14న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సంక్షేమ హాస్టళ్లను సంద‌‌ర్శించి స్టూడెంట్స్​తో కలిసి స‌‌హ‌‌పంక్తి భోజ‌‌నం చేస్తారని, ఇందులో విద్యార్థుల పేరెంట్స్​ కూడా పాల్గొనాలని సూచించారు.

రాష్ట్రంలో కోటీ 16 ల‌‌క్షల కుటుంబాల‌‌కు గాను కోటీ12 ల‌‌క్షల కుటుంబాల కులగణన సర్వే (99.09 శాతం) పూర్తయిందని మంత్రి చెప్పారు. ఇందుకు కృషి చేసిన అధికారుల‌‌కు ప్రభుత్వం తరఫున మంత్రి అభినంద‌‌న‌‌లు తెలిపారు. ఇంటింటి కులగణన సర్వేకు ఈ నెల13వ తేదీ చివరి గడువని, ఆ తర్వాత ప్రజాపాల‌‌న సేవా కేంద్రాల్లో కుటుంబ స‌‌ర్వే వివ‌‌రాల‌‌ను న‌‌మోదు చేసుకోవ‌‌చ్చని సూచించారు.ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌‌- 2 ప‌‌రీక్షల‌‌కు ప‌‌క‌‌డ్బందీ ఏర్పాట్లు చేయాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు.