- ఇంకా 3.21 లక్షల దరఖాస్తులే మిగిలినయ్
- ఇండ్లు రానివారు వచ్చే నెలలో నిర్వహించే వార్డు సభల్లో అప్లయ్ చేసుకోవచ్చు
- స్పష్టం చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం10.71 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.150 డివిజన్లతోపాటు సికింద్రాబాద్కంటోన్మెంట్బోర్డు పరిధిలోని పేదలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేసేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో 2,249 మంది అధికారులతో సర్వే జరుగుతోందని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్మేనేజింగ్డైరెక్టర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు 7.50 లక్షల దరఖాస్తుల వెరిఫికేషన్పూర్తయ్యిందన్నారు. మిగిలిన 3.21 లక్షల దరఖాస్తులను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.
దరఖాస్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రజాపాలన దరఖాస్తులో పొందుపరిచిన ఆధార్‌నెంబర్, మొబైల్ నెంబర్లతో https://indirammaindlu.telangana.gov.in/applicantSearch సైట్ఓపెన్చేస్తే మీ దరఖాస్తును పరిశీలించే అధికారి పేరు, వారి మొబైల్ నంబర్ వస్తుందన్నారు. వారిని సంప్రదించి అప్డేట్స్తెలుసుకోవచ్చన్నారు.
ప్రస్తుతం ఇందిరమ్మ గ్రామ/వార్డు సభలు జీహెచ్ఎంసీ పరిధిలో జరగడం లేదని ఇతర జిల్లాల్లో జరుగుతున్నాయని తెలిపారు. సర్వే పూర్తి చేసిన తర్వాత వార్డు సభల తేదీలను ప్రకటిస్తారని తెలిపారు. గతంలో నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోకపోయినా వార్డు సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే ఇదివరకే దరఖాస్తు చేసుకొని, రశీదు ఉండి ఇందిరమ్మలో పేరు అప్లోడ్ కాని వారు వార్డు సభల్లో పూర్తి వివరాలు అందజేస్తే వారి దరఖాస్తులను సర్వే చేస్తారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అనుమానాలు, వివరణలు కావాలంటే దగ్గరలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ను సంప్రదించాలని కోరారు.