మేడిపల్లిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇందిరమ్మ ఇండ్లు : అడిషనల్ కలెక్టర్ దీపక్​తివారీ

మేడిపల్లిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇందిరమ్మ ఇండ్లు : అడిషనల్ కలెక్టర్ దీపక్​తివారీ
  • ఫారెస్ట్ ఆబ్జెక్షన్ నేపథ్యంలో అధికారుల యోచన
  • ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించా 

కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా సిర్పూర్ టీ మండలంలో మేడిపల్లి గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అయితే ఇక్కడ మంజూరైన 172 ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గు వేసే సమయంలో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఊరు ఉన్న జాగా రిజర్వ్ ఫారెస్ట్​లోకి వస్తుందని మెలిక పెట్టారు. ఇండ్లు నిర్మించొద్దని నోటీస్ ఇచ్చారు. దీంతో రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు అక్కడ ఇండ్ల పనులు మొదలు కాలేదు. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆదివాసీలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు సిద్ధవుతున్నారు. 

గురువారం కౌటాల మండలంలో పర్యటించిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ నాగేపల్లిలో ఇండ్లు నిర్మించనున్న స్థలాన్ని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ నుంచి అబ్జెక్షన్ నేపథ్యంలో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టామని, సమస్యపై హౌసింగ్ అధికారులతో మాట్లాడామన్నారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ప్రీ ఫ్యాబ్రికెట్ విధానంలో ఇంటి నిర్మాణం కోసం గోడలు, స్లాబ్, సహా అన్నింటినీ ముందుగానే నిర్మించి తీసుకొచ్చి బిగించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించారు.  ఎంపీడీవో కోట ప్రసాద్, ఈజీఎస్ ఏపీవో పూర్ణిమ, తహసీల్దార్ పుష్పలత, హౌసింగ్ ఏఈ సజియుద్దీన్, సెక్రటరీ సంధ్యారాణి తదితరులు ఉన్నారు.