ఇందిరమ్మ మోడల్ విలేజీల్లో చకచకా ఇళ్ల నిర్మాణం

ఇందిరమ్మ మోడల్ విలేజీల్లో  చకచకా ఇళ్ల నిర్మాణం
  • ముహూర్తాలు చూసుకుని ముగ్గు పోసుకుంటున్న లబ్ధిదారులు
  • ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న కొందరి ఇళ్ల నిర్మాణం
  • బేస్ మెంట్ లెవల్‌‌కు చేరుకోగానే తొలి విడత సాయం రూ.లక్ష జమ

కరీంనగర్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో వారం రోజులుగా జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మండలానికో మోడల్ విలేజీ చొప్పున జిల్లాలోని 15 మండలాల్లో 15 గ్రామాల్లో సుమారు 2 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులు ముహూర్తం చూసుకుని ముగ్గు పోసుకుంటున్నారు. మరికొందరు తమ పాత ఇళ్లను కూల్చేసి ఉగాది తర్వాత పని మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

 వారం, నాలుగైదు రోజుల కింద ప్రారంభించిన ఇళ్లలో కొన్ని ఇప్పటికే బేస్‌‌మెంట్ లెవల్ వరకు నిర్మాణమయ్యాయి. ఈ ఏడాది  ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో తొలుత మోడల్ విలేజీల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకుంది. దీంతో అన్ని మండలాల్లో ఎంపీడీవోల పర్యవేక్షణలో పంచాయతీ సెక్రటరీలు ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరగా ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టేలా చర్యలు 
తీసుకుంటున్నారు.

 ఇళ్ల కోసం 33,630 అప్లికేషన్లు.. 

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సభల్లో 33,630 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లను పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆఫీసర్లకు పంపగా.. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం అప్లై చేసుకున్న వారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. వారు చూపిన స్థలాన్ని లబ్ధిదారు వివరాలతో జియో ట్యాగింగ్ చేశారు. అలాగే సొంత భూమి లేని వారిని ఎల్-2 జాబితాలో చేర్చారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఎల్-3 జాబితాలో చేర్చారు. 

జిల్లాలో ఇళ్ల నిర్మాణాలిలా.. 

గంగాధర మండలంలో ఇందిరమ్మ మోడల్ విలేజీ కురిక్యాలలో 30 మంది లబ్ధిదారులను గుర్తించగా, వారిలో 20 మంది లబ్ధిదారులు బేస్‌‌మెంట్‌‌ లెవెల్ వరకు పూర్తి చేశారు. అధికారులు పరిశీలించి ఫొటోలు యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో 214 మంది లబ్ధిదారులను గుర్తించగా.. వీరిలో 85 మంది భూమిపూజ చేశారు.  సైదాపూర్ మండలం వేన్కేపల్లి గ్రామంలో  260 మందిలో ఆరుగురు, శంకరపట్నం మండలం ఇప్పలపల్లిలో 87 మంది లబ్ధిదారుల్లో 16 మంది, గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో 146  మంది లబ్ధిదారుల్లో 16 మంది పనులు మొదలుపెట్టారు. 

Also Read :- దరఖాస్తులు వేలు, ఎల్ఆర్ఎస్ అయినవి వందలు

కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో  124 మందిని ఎంపిక చేయగా 18 మంది, జమ్మికుంట మండలం గండ్రపల్లిలో 136 మందికి  23 మంది, ఇల్లందకుంట మండలం భోగంపాడులో 92 మంది లబ్ధిదారుల్లో ఆరుగురు, చిగురుమామిడి మండలం గుణుకులపల్లెలో 36 మందిలో 11 మంది, చొప్పదండి మండలం చిట్యాలపల్లిలో 150 మందికిగాను 27 మంది, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో  92 మందికి గానూ14 మంది, కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ లో 106 మందికిగానూ 25 మంది, మానకొండూరు మండలం ముంజంపల్లిలో 140 మందికిగానూ ముగ్గురు, వీణవంక మండలంలోని శ్రీరాములపేటలో 136 మందికిగాను 16 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. 

బేస్ మెంట్ లెవల్ నిర్మాణం పూర్తయితే రూ.లక్ష సాయం.. 

ఫిబ్రవరి 21న నారాయణపేట జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాలో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. ఈ నెల 5న ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల కోడ్ ముగిసింది. ఆ తర్వాతే ఎంపీడీఓలు మోడల్ విలేజీల్లో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ పనులు ప్రారంభించారు. ముగ్గు పోసే ముందు లబ్ధిదారులు పంచాయతీ సెక్రటరీలకు సమాచారమిస్తున్నారు. 

పిల్లర్లతోపాటు బేస్ మెంట్ లెవల్ పూర్తయ్యాక తొలి విడత సాయం రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ కానుంది. ఆ తర్వాత నిర్మాణం పూర్తి చేస్తున్న కొద్ది విడతలవారీగా మిగతా రూ.4 లక్షల మొత్తం విడుదల కానుంది. లబ్ధిదారులు 400 స్క్వైర్​ఫీట్స్ కంటే తగ్గకుండా ఇల్లు కట్టుకోవాలనే కండీషన్ ఉంది. ప్రతి లబ్ధిదారుడికి 8 ట్రాక్టర్ల ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయనుంది. ఇసుక కూపన్లను తహసీల్దార్లు జారీ చేయనున్నారు.