
- నిర్మించేందుకు వీల్లేదంటూ ఎంపీడీవోకు అటవీ అధికారుల నోటీసులు
- జాయింట్ సర్వే చేసిన ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు
- 2 నెలలైనా మొదలు కాని పనులు
- తమ గోస చూడరా అంటూ ఆదివాసీల ఆవేదన
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని ఆదివాసీ గ్రామం మేడిపల్లి. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాలను అధికారులు గత జనవరి 26న ఈ పల్లెలో ప్రారంభించారు. మేడిపల్లికి 76, గ్రామ పరిధిలోని లింబుగూడకు 63, రావణ్ పల్లికి 16 మొత్తం 150 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. కానీ, అటవీ శాఖ అధికారుల తీరుతో 2 నెలలైనా పనులు ప్రారంభం కాలేదు.
రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందట..
గణతంత్ర దినోత్సవం రోజు అధికారులు మేడిపల్లిలో మీటింగ్ పెట్టి, ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలు ఇవ్వడంతో ఆదివాసీలు సంతోషపడ్డారు. గుడిసెలు, తడకల ఇళ్లల్లో ఉంటూ పడుతున్న బాధలు ఇక తీరుతాయనుకున్నారు. ఈ క్రమంలో మేడిపల్లి రిజర్వ్ డ్ఫారెస్ట్పరిధిలో ఉందని, ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టొద్దని అటవీ శాఖ అధికారులు బ్రేక్వేశారు. ఈ నెల 13న సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్ ఎంపీడీవో కు నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది.
తాతల కాలం నుంచి ఉంటున్నామని ఆవేదన
మేడిపల్లిలో సీసీ రోడ్లు, మిషన్ భగీరథ ట్యాంక్, విద్యుత్ కనెక్షన్లు, పాఠశాల తదితర సౌకర్యాలు ఉన్నాయి. కేవలం ఇంటర్నెట్ లేదు. మేడిపల్లి, లింబుగూడ, రావణ్ పల్లి కలిపి దాదాపు 750 మంది నివసిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు మొదలు పెట్టే సమయానికి ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుపడ్డారని ఆవేదన చెందుతున్నారు. తాము తాతల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నామని, 50 ఏండ్ల నుంచి పట్టా భూములు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం ముగ్గు పోయగా.. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి, పనులు నిలిపివేయించారు.
తేలని జాయింట్ సర్వే.. మరికొన్ని గ్రమాల్లోనూ..
ఫారెస్ట్‌అధికారులు నోటీసులిచ్చిన విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే ఫారెస్ట్ , రెవెన్యూ శాఖల నేతృత్వంలో జాయింట్ సర్వే చేయాలని ఆదేశించారు. దీంతో, తహసీల్దార్ శ్రీనివాస్, సర్వేయర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, బీట్ ఆఫీసర్లు సర్వే చేపట్టారు. 10 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు నివేదిక ఫైనల్ కలేదని తెలిసింది. హుడ్కులి, హనుమంతు గూడ, పుసుగూడ,ఆరెగూడ, ఇటికెల పహాడ్ గ్రామాల్లోనూ అటవీ శాఖ అనుమతి లేకుండా ఇండ్ల నిర్మాణాలు చేపట్టవద్దని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇండ్లు కట్టేందుకు పర్మిషన్ లేదు
రిజర్వ్డ్ ఫారెస్ట్భూముల్లో ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు. మేడిపల్లిలో నిర్మాణాలు వద్దని నోటీసులిచ్చింది వాస్తవమే. జాయింట్ సర్వే చేశాం. రెవెన్యూ, ఫారెస్ట్ శాఖలకు సంబంధించి లొకేషన్ మ్యాచ్ కావాల్సి ఉంది. సాట్అవుట్చేయాలని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా కు నివేదిక ఇచ్చాం.
నీరజ్ కుమార్ టిబ్రెవాల్, డీఎఫ్ వో, ఆసిఫాబాద్
రేకుల షెడ్డు లో ఉంటున్నం
పిల్లలతో కలిసి రేకుల ఇంట్లో ఉంటున్నం. వానొచ్చినా, గాలి దుమారం వచ్చినా ఇబ్బంది పడుతున్నం. పక్కా ఇల్లు కట్టుకునే స్థోమత మాకు లేదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంతోషపడ్డం. కానీ, ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డు పడ్తున్నరు.
సూర్పం తానుబాయి,
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుమాపై ఎందుకింత కోపం?
మాపై ఫారెస్ట్ ఆఫీపర్లకు ఎందుకింత కోపం? టైగర్ జోన్ కోసమే ఇబ్బంది పెడుతున్నరు. గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినప్పుడు, ప్రజాపాలన సభ పెట్టి, మంజూరు ప్రతాలు ఇచ్చినప్పడు ఎటు పోయారు? ఇండ్ల పనులు అడ్డకుంటామంటే ఉద్యమిస్తాం.
సూర్పం మారు, రాజ్ గోండ్ సేవా సమితి, డివిజన్ అధ్యక్షుడు