
- ఇటీవల గైడ్ లైన్స్ జారీ చేసిన రాష్ట్ర సర్కార్
- గత డిసెంబర్‌లో స్పెషల్ ప్యాకేజీ కింద రూ.230కోట్లు మంజూరు
- నిర్వాసితులు అప్లై చేసుకోవాలని ఆఫీసర్ల సూచన
- 4,696 మంది లబ్ధి పొందే అవకాశం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటికి రూ.5లక్షల చొప్పున 4,696 ఇండ్ల కోసం గత డిసెంబర్‌లో రూ.230 కోట్లు కేటాయించగా.. తాజాగా గైడ్‌లైన్స్ రిలీజ్ అయ్యాయి. 2005లో మిడ్‌మానేరు(శ్రీ రాజరాజేశ్వర డ్యాం) రిజర్వాయర్ నిర్మాణానికి నాటి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2018లో ఈ ప్రాజెక్ట్ పూర్తికాగా డ్యాంలో సుమారు 12 గ్రామాలు ముంపునకు గురికాగా సర్వం కోల్పోయారు. ఆ తర్వాత కొందరు ఇండ్లను నిర్మించుకోగా.. చాలామంది సర్కార్ సాయం ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ముంపు బాధితులు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆఫీసర్లు కోరుతున్నారు.
12 గ్రామాల నిర్వాసితులకు లబ్ధి
శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్ట్( మిడ్ మానేరు)లో వేములవాడ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లి, చీర్లవంచ, చింతలఠాణా, కొదురుపాక, రుద్రవరం, సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం, కొడిముంజ, వరదవెల్లి, శెభాష్ పల్లి గ్రామాలు నీటమునిగాయి. ఈ గ్రామాల్లో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వ హయాంలో 10,600 మందికి వేములవాడ సమీపంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 242 గజాల చొప్పున ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షలు ఇస్తామని నాటి సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ దర్శనం సందర్భంగా హామీ ఇచ్చి మరిచారు.
పదేండ్లలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అయితే నిర్వాసితుల్లో సుమారు 6వేల మంది దాకా సొంత ఖర్చులతో ఇండ్లు కట్టుకున్నారు. మిగతా వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 5 నెలల కింద ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ చొరవతో 4,696 మందికి ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు మంజూరు చేయించారు. ప్రస్తుతం అప్లై చేసుకున్న ప్రతి నిర్వాసితుడికి ఇండ్లు మంజూరు చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది.
అప్లై చేసుకుంటే నిర్వాసితులకు ఇండ్లిస్తాం
మిడ్‌మానేరు నిర్వాసితులు ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకుంటే, ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షల ఇచ్చేందుకు ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇంటి నిర్మాణంలో దశల వారీగా పూర్తయిన వెంటనే వారి అకౌంట్లలో డబ్బు జమ చేస్తాం. నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కింద గత డిసెంబర్ లో రూ.230 కోట్లు మంజూరయ్యాయి. తాజాగా ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. సందీప్ కుమార్ ఝా, రాజన్నసిరిసిల్ల కలెక్టర్