ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. ఏఈ పోస్టులకు మస్త్​ డిమాండ్​

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్.. ఏఈ పోస్టులకు మస్త్​ డిమాండ్​
  • 390 పోస్టులకు 10 వేల దరఖాస్తులు
  • ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మండలానికొకరి నియామకం
  • మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్.. పూర్తయిన సెలక్షన్ 
  • 23న అపాయింట్మెంట్ ఆర్డర్లు
  • వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లోకి కొత్త ఏఈలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 390 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)ల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కు భారీ స్పందన వచ్చింది. మండలానికో ఏఈ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా సుమారు10 వేల అప్లికేషన్లు వచ్చినట్టు తెలిసింది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఏఈల భర్తీ కోసం ఈ నెల 4న జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తులు అదే రోజు నుంచి స్వీకరించగా.. గడువు ఈ నెల 11తో ముగిసింది. ఇటీవల వీరి సెలక్షన్ కూడా పూర్తయిందని ఏజెన్సీ నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 23న  వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. 

కొత్త ఏఈలకు హైదరాబాద్ మాదాపూర్ లోని న్యాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ర్టక్షన్) ఆఫీసులో వారం రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లో చేరనున్నారు. ఇందిరమ్మ స్కీమ్ ప్రాధాన్యత, అప్లికేషన్లు, లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణ పర్యవేక్షణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై ట్రైనింగ్ లో అధికారులు దిశానిర్దేశం చేయనున్నారు. ఏడాది కాలానికిగాను నెలకు రూ.33,800 వేతనంతో సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను మార్కుల్లో మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసుకోనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.  

505 పోస్టులకు 125 మందే ఉన్నరు..
హౌసింగ్ కార్పొరేషన్ కు మొత్తం 505 ఏఈ పోస్టులు శాంక్షన్ కాగా.. ప్రస్తుతం125 మంది మాత్రమే ఉన్నారు. వీరిలోనూ ఈ ఏడాది చాలా మంది రిటైర్ కానున్నారు. అయితే, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు ప్రతి మండలానికి ఒక ఇంజనీర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్సీ ద్వారా ఏఈల నియామకం చేపట్టాలంటే సుమారు ఏడాది టైమ్ పడుతుంది. కానీ స్కీమ్ ను ఇప్పుడు అమలు చేయాలంటే ఏఈల పాత్ర కీలకం కావడంతో ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ ఏఈలను నియమించుకోవాలని, ఈ లోపు టీజీపీఎస్సీ ద్వారా ఏఈ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే అన్ని శాఖలను ఉద్యోగుల ఖాళీల వివరాలను టీజీపీఎస్సీ అడిగింది. అయితే హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను గత ప్రభుత్వం ఆర్ అండ్ బీలో విలీనం చేయడంతో సమగ్ర వివరాలను అందించలేదు. దీంతో ఇటీవల టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేసినా హౌసింగ్  డిపార్ట్ మెంట్ వివరాలు ఇవ్వనందున నియామకం జరగలేదు. 

ఏఈల ఆమోదం తప్పనిసరి..  
రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 70,122 మందికి ఈ ఏడాది జనవరి 26న ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. ఇందులో సుమారు 7 వేల మంది అనర్హులని తేలగా, వారికి ఇండ్లను రద్దు చేశారు. మిగతా 63 వేల మంది అర్హులుగా తేలగా.. వాళ్లలో 25 వేల మంది ముగ్గులు పోశారు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది బేస్ మెంట్ వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. బేస్ మెంట్ పూర్తి చేసినవారిలో 2,019 మంది లబ్ధిదారులకు తొలి విడత సాయం రూ.లక్ష ను వారి ఖాతాల్లోకి ప్రభుత్వం ఇటీవల జమ చేసింది. వీరిలో పలు జిల్లాలకు చెందిన12 మంది లబ్ధిదారులకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చెక్కులు అందజేశారు.

బేస్ మెంట్ పూర్తి చేసిన మిగతా వారికీ వెంటనే రూ.లక్ష సాయం అందేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం నాలుగు దశల్లో రూ.5 లక్షల సాయం అందజేస్తున్నది. ఫస్ట్ ఫేజ్ లో బేస్ మెంట్ పూర్తయిన ఇండ్లను ఏఈలు పరిశీలించి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఏఈ సర్టిఫై చేసిన తర్వాతే లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో రూ. లక్ష జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కోసం త్వరలోనే రూ. 1,000 కోట్లను సర్కారు రిలీజ్ చేయనుంది.