సొంతింటి కల సాకారం!.. జిల్లాలో 724 ఇండ్ల శాంక్షన్

సొంతింటి కల సాకారం!..  జిల్లాలో 724 ఇండ్ల శాంక్షన్
  • 326 ఇండ్లు గ్రౌండింగ్ 
  • కొన్ని బేస్మెంట్ లెవల్ కంప్లీట్
  • పేమెంట్ ప్రపోజల్ పంపిన హౌసింగ్ డిపార్టుమెంట్​ 
  • నెలాఖరుకు ఫస్ట్ పేజ్ బిల్లు

యాదాద్రి, వెలుగు : పదేండ్ల ఎదురుచూపుల తర్వాత నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండ్లు నిర్మాణం ప్రారంభమైంది. లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రపోజల్స్​ పంపించింది. నెలాఖరుకు అందే అవకాశముంది. 

నియోజకవర్గానికి 3,500..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని రెండు పూర్తి నియోజకవర్గాలు, మూడు పార్ట్​ నియోజకవర్గాల లెక్కన జిల్లాకు దాదాపు వెయ్యి ఇండ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రజాపాలనతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ఇండ్ల కోసం జిల్లాలోని 17 మండలాల్లో 52,109 మంది అప్లికేషన్లు చేసుకున్నారు. 

అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా (ఎల్-1, ఎల్-2, ఎల్-3)గా విభజించింది. ఇందులో సొంత ఇంటి స్థలం ఉన్నవారిని ఎల్-1 జాబితాలో చేర్చింది. వీరందరూ ఫస్ట్​ ఫేజ్​లో నిర్మించుకునేలా హౌసింగ్ డిపార్ట్​మెంట్​చర్యలు తీసుకుంటోంది.

724 ఇండ్లు శాంక్షన్.. కొనసాగుతున్న వెరిఫికేషన్..

ఆరు గ్యారంటీలను జనవరి 26న ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 17 మండలాల్లోని ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 1,144 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు ప్రొసీడింగ్స్ అందించారు. ఆ తర్వాత నిర్వహించిన వెరిఫికేషన్​లో 420 మందిని వివిధ కారణాల వల్ల జాబితా నుంచి తొలగించారు. మిగిలిన 724 ఇండ్లను శాంక్షన్​చేశారు. ఇవేకాకుండా అప్లికేషన్​చేసుకున్న వారి వద్దకు వెళ్లి వెరిఫికేషన్ చేస్తున్నారు. 

326 ఇండ్లు గ్రౌండింగ్..

శాంక్షన్ అయిన ఇండ్లలో ఇప్పటివరకు 326 కుటుంబాలు నిర్మాణం ప్రారంభించాయి. వీటిలో ఒక్కో నిర్మాణం ఒక్కో లెవల్లో ఉంది. అయితే ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో 400 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. అంతకు మించి నిర్మాణం చేసినట్టయితే ఖర్చు పెరిగి ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తున్నారు. బెడ్రూమ్ (అటాచ్ బాత్రూమ్), ఒక హాల్, కిచెన్ నిర్మించుకోవాల్సి ఉంది. పనులు ప్రారంభించే ముందు ఖాళీ స్థలం ఫొటో తీసి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ యాప్​లో అప్లోడ్ చేయాలి. బేస్మెంట్, గోడలు, లెంటల్, శ్లాబు లెవల్, ఇంటికి రంగులు వేసే ప్రతి స్థాయిలో ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు యాప్​లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రకారం బేస్మెంట్​దశలో రూ.లక్ష, గోడలు పూర్తి కాగానే రూ.లక్ష, శ్లాబు లెవల్ రూ.2 లక్షలు, ఇంటికి రంగులు వేశాక రూ.లక్ష లబ్ధిదారుల అకౌంట్​లో జమ చేయనుంది. కాగా ఇప్పుడు నిర్మాణం చేపట్టిన వాటిలో ఇప్పటికీ 17 ఇండ్లు బేస్మెంట్ లెవల్​కంప్లీట్ అయ్యాయి. వీటికి సంబంధించిన బిల్స్ రెడీ చేసి రిలీజ్​కోసం హయ్యర్ ఆఫీసర్లకు ప్రపోజల్స్​పంపించారు. ఈ నెలాఖరుకు వీటికి సంబంధించిన అమౌంట్​లబ్ధిదారుల అకౌంట్స్​లో జమ కానుంది. 

సకాలంలో నిర్మాణాలు 

లబ్ధిదారులు ఇండ్లను రూల్స్ ప్రకారం నిర్మించుకోవాలి. ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకొని ఇబ్బందులు పడవద్దు. గతంలో నిర్మించిన వాటికి, మధ్యలో నిలిపివేసిన ఇండ్లకు బిల్స్ ఇవ్వం. ఇండ్ల నిర్మాణాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. - విజయ్​సింగ్, హౌసింగ్​ పీడీ, యాదాద్రి