- రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తం
- ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభం
- డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు
- అందుకే జనం ఆయన పాలనను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరు
భద్రాచలం, వెలుగు : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది ఇల్లే. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టు లెక్క. అందుకే ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలని నిర్ణయించినం. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నం..’’ అని స్పష్టం చేశారు. ఆరుగ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను సోమవారం భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
అనంతరం సభలో మాట్లాడుతూ.. భద్రాద్రి రాముడి సాక్షిగా ఐదో గ్యారంటీ కింద ఇండ్ల స్కీంను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాపాలనలో 92 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేసి చూపించామని, కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు కాదు చేతల ప్రభుత్వమని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టామని చెప్పారు. ‘‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నం.. ఈ స్కీమ్‌ద్వారా ఇప్పటికే 24 కోట్ల ఫ్రీ జర్నీలు జరిగినయ్. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఉచిత వైద్యం అమలవుతున్నది. రూ.500కే గ్యాస్‌బండ ఇస్తున్నం. జీరో కరెంట్ బిల్లు, ఇందిరమ్మ ఇండ్లు.. ఇట్ల అన్నీ చేసి చూపిస్తున్నం.. ’’ అని ఆయన పేర్కొన్నారు.
పీఎం ఆవాస్ యోజన కింద ఎన్ని ఇండ్లు కట్టిన్రు?
‘‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు కట్టారో? దమ్ముంటే బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ చూపించాలి’’ అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానన్న ప్రధాని మోదీ ఢిల్లీ సరిహద్దుల్లో గిట్టుబాటు ధర కోసం దీక్షలు చేస్తుస్తున్న రైతులను బలిదీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం తెచ్చి పేదోళ్ల బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షల చొప్పున వేస్తానని మోదీ చెప్పారని, మరి ఎంత మంది ఖాతాల్లో వేశారో చూయించాలని అన్నారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ.. పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణలో 60 లక్షల నుంచి 70 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి అవన్నీ ఎక్కడున్నయో చూపించాలి” అని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా కేంద్రంలోని మోదీని అడుగుతామని, కడిగేస్తామని, బండకేసి రుద్దుతామని ఆయన అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అన్ని స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు.
పదేండ్లలో మీరు చేసిందేమిటి?
రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోదీ కలిసి పదేండ్లలో ఏం చేశారో జనాలకు చెప్పి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని సీఎం రేవంత్ అన్నారు. ‘‘ఇద్దరూ కలిసి రూ.400 ఉండే గ్యాస్ ధరను రూ.1,200 చేసిన్రు. లీటర్ పెట్రోల్‌ను రూ.55 నుంచి 110కి, లీటర్ డీజిల్‌ను రూ.50 నుంచి 100కు పెంచిన్రు. కేసీఆర్‌కు ఒకటే సవాల్ విసురుతున్న.. నువ్వు ఏ గ్రామాల్లో డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించినవో అక్కడికి వెళ్లి ఓట్లు అడుగు. పదేండ్ల కింద కాంగ్రెస్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు ఉన్న గ్రామాల్లోకి వెళ్లి మేము ఓట్లు అడుగుతం’’ అని తేల్చిచెప్పారు. డబుల్బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ పదేండ్ల పాటు ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. ‘‘పదేండ్ల పాటు కేసీఆర్ చెప్పిన కథనే మళ్లీ మళ్లీ చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నరు’’ అని సీఎం పేర్కొన్నారు.