ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు..4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యం

ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు..4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని లక్ష్యం
  • కోటి 12 లక్షల క్యూబిక్  మీటర్ల ఇసుక అవసరం అని అంచనా
  • జిల్లాల వారీగా ఇసుక వివరాలను మైనింగ్​కు ఇచ్చిన హౌసింగ్ శాఖ
  • లబ్ధిదారుల ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  ఈ ఆర్థిక సంవత్సరంలో స్పీడప్  కానుంది. గత ఏడాది కేవలం 71 వేల మంది లబ్ధిదారులకే ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు సాంక్షన్  చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 119 నియోజకవర్గాలకు 3,500 ఇళ్ల చొప్పున 4,16,500 ఇండ్లు, సీఎం కోటా కింద మరో 33,500 ఇండ్లను మంజూరు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇసుక, సిమెంట్, ఐరన్  వంటి అంశాలపై ప్లాన్ రూపొందించారు.

రాష్ర్టంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి 1.12 కోట్ల క్యూబిక్  మీటర్ల ఇసుక అవసరం అని హౌసింగ్  అధికారులు అంచనా వేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి  25 క్యూబిక్  మీటర్లు అంటే 8 ట్రాక్టర్  ట్రక్కుల ఇసుక అవసరం అని చెబుతున్నారు. జిల్లాల వారీగా ఇసుక ఎంత అవసరమో తెలుపుతూ మైనింగ్  డిపార్ట్ మెంట్ కు హౌసింగ్  అధికారులు వివరాలు అందజేశారు. ఇటీవల హౌసింగ్  అధికారులతో మైనింగ్  ఎండీ సుశీల్ కుమార్  రివ్యూ మీటింగ్  నిర్వహించారు.

గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ కు 25 లక్షలు, ఈ ఏడాది వరుసగా 3 క్వార్టర్లలో 25 లక్షల క్యూబిక్  మీటర్ల ఇసుక చొప్పున 75 లక్షల క్యూబిక్  మీటర్ల ఇసుక, చివరి క్వార్టర్ లో 12 లక్షల క్యూబిక్  మీటర్ల ఇసుక అవసరం అని జిల్లాల వారీగా వివరాలను మైనింగ్  శాఖకు అందజేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం ఆదేశించడంతో తాజాగా ఇసుక రీచ్ ల నుంచి లబ్ధిదారుని ఇంటి వరకు ఉచితంగా ట్రాన్స్ పోర్ట్  చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

సిమెంట్  కంపెనీలతో త్వరలో మీటింగ్ 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటికే ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుండగా మార్కెట్  రేటుతో పోలిస్తే తక్కువ ధరకు సిమెంట్ ను కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ర్టంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, తెలంగాణ ఏర్పడ్డాక డబుల్  బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి కూడా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి మార్కెట్  రేటు కన్నా తక్కువ ధరకు సిమెంట్  సరఫరా చేశారు.

ఇపుడు కూడా అదే విధానాన్ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈనెల 30 కల్లా పూర్తి చేయాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్  రెడ్డి ఆదేశించారు.