
హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులను ఎంపిక చేసి ఇబ్బంది పడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫీసర్లకు సూచించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం, సంచార చేపల విక్రయ కేంద్రం, ఫిష్ ఫ్రై వెహికల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండవద్దని సూచించారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రజలు ప్రశంసించేలా ఉండాలన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ధరణి ద్వారా కలిగిన ఇబ్బందులను దూరం చేసేందుకు భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్, ఆర్డీవోలకు సూచించారు. దేవాదుల కుడి కాలువ ద్వారా నీళ్లను అందిస్తామని, ముల్కనూర్ అంబేద్కర్ జంక్షన్ ను డెవలప్ చేస్తామని తెలిపారు. కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్డీవో మేన శ్రీను, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు.