- కారుణ్య నియామకాలు చేపట్టండి
- హౌసింగ్ కార్పొరేషన్ ఇంజినీర్ల సమావేశంలో తీర్మానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌ను సక్సెస్ చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకట్రామ్ రెడ్డి కోరారు. జాగా ఉండి స్కీమ్‌కు అర్హులైతే ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్‌లో అసోసియేషన్ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఖమ్మం జిల్లాకు చెందిన బొగ్గుల వెంకట్రామ్‌రెడ్డిని ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. ‘‘ఇతర శాఖల్లో డిప్యూటేషన్ మీద పని చేస్తూ కార్పొరేషన్లో జాయిన్ అయిన ఏఈలకు సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఇంజినీర్లు తమ సొంత జిల్లాల్లోనే పని చేస్తున్నరు. 2009 నుంచి హౌసింగ్ కార్పొరేషన్లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలివ్వాలి.
బాధిత కుటుంబాలకు త్వరలోనే మంత్రి పొంగులేటి చేతుల మీదుగా అసోసియేషన్ తరఫున ఆర్థిక సహాయం అందిస్తం’’అని తెలిపారు. నిరుడు అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న ఐఆర్ వెంటనే రిలీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు వెంకయ్య, షరీఫ్, ఆంజనేయులు, రమేశ్, దుర్గా ప్రసాద్, ఇంజనీర్లు, వర్క్ ఇన్స్ పెక్టర్లు పాల్గొన్నారు.