అవయవ దానం చేసిన వారి ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి: హరీశ్​ రావు

అవయవ దానం చేసిన వారి ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: అవయవదానం చేసిన వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, వారి పిల్లలకు గురుకులాల్లో సీటు, ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని సూచించారు. ఇలాంటి ప్రత్యేకతలు కల్పిస్తే అవయవదానాన్ని మరింత ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. గురువారం అసెంబ్లీలో అవయవదానం బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున హరీశ్​రావు మాట్లాడారు. 

ఈ బిల్లు ఎంతో ఉపయోగకరమన్నారు. దీని ద్వారా గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్ర్డన్‎కు ఆర్గాన్స్​దానం చేసే అవకాశం కలుగుతుందన్నారు. పరస్పరం అవయవాదనం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవయవదానం కోసం 3,724 మంది అప్లికేషన్ పెట్టుకొని ఆర్గాన్స్​కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. అవయవదానం చేసిన డెడ్ బాడీకి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలన్నారు.  

కిడ్నీల దందాను అరికట్టాలి: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​బాబు

రాష్ట్రంలో కిడ్నీల దందాను అరికట్టాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​బాబు ప్రభుత్వాన్ని కోరారు. అలకానంద హాస్పిటల్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. చిన్న పిల్లల్లో కార్నియా చెడిపోతోందని, ఎల్ వీ ప్రసాద్ హాస్పిటల్ లో దీనిని కూడా మారుస్తున్నారని హరీశ్​బాబు వెల్లడించారు.