- భయాందోళనలో బాధిత కుటుంబాలు
- కట్ట నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చి ఆర్నెళ్లు
- ఎస్టిమేషన్లు, సర్వేలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
- వానలు పడితే పునరావాస కేంద్రానికి వెళ్లాల్సిందే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రం కొత్తగూడెంతోపాటు లక్ష్మీదేవిపల్లి మండలాన్ని ఆనుకుని ముర్రేడు వాగు పారుతోంది. దీనికి ఇరువైపులా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్, సంజయ్‌నగర్, హమాలీకాలనీ జీపీలతోపాటు పాతకొత్తగూడెంలోని పలు బస్తీలు, కాలనీల్లో ప్రజలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు. ఓ వైపు ముర్రేడు వాగు ఉధృతితో భూమి కోతకు గురై ఇండ్లు కూలుతుండగా గతంలో ప్రభుత్వాలు కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో అవి ఎప్పుడు కూలుతాయోనన్న భయాందోళనల మధ్య గడుపుతున్నారు. గత జనవరిలో సీఎం కొత్తగూడెం పర్యటనకు వచ్చిన టైంలో భూమి కోతకు కాకుండా చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. సీఎం ఆదేశాలు ఇచ్చి ఆర్నెళ్లు గడిచినా సర్వేలు, ఎస్టిమేషన్లతోనే ఆఫీసర్లు కాలం వెళ్లదీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎప్పుడేం జరుగుతుందోనని...
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్, సంజయ్‌నగర్, హమాలీకాలనీ జీపీలతోపాటు పాతకొత్తగూడెంలో ముర్రేడు వాగుకు ఇరువైపులా ఇండ్లను కట్టుకుని ఉంటున్నారు. కాగా గత కొన్నేండ్లుగా ముర్రేడు వాగు ఉధృతి ఏటేటా పెరుగుతోంది. ప్రతి ఏడాది ఇండ్లు కూలుతున్నాయి. ఇప్పటికే దాదాపు 20కిపైగా ఇండ్లు కూలాయి. సంజయ్ నగర్‌కు చెందిన ఓ రైతు భూమి దాదాపు రెండెకరాల మేర కోతకు గురైంది. ప్రస్తుతం కురుస్తున్న వార్షాలతో నాలుగు ఇండ్లు కూలగా మరికొన్ని దెబ్బతిన్నాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఇంట్లోని వస్తువులు కొట్టుకుపోయాయి.
మారిన ఎస్టిమేషన్లు...
ముర్రేడు వాగు ఉధృతితో ఇరువైపులా భూమి కోతకు గురై ఇండ్లు కూలిపోతున్నాయంటూ ఈ ఏడాది జనవరిలో కొత్తగూడెంకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు వివరించారు. భూమి కోత నివారణకు కరకట్ట నిర్మించేందుకు రూ.150 కోట్లు అవసరమని సీఎంకు విన్నవించారు. స్పందించిన సీఎం సమగ్ర సర్వే చేయించి ప్రపోజల్స్ పంపితే ఫండ్స్ఇస్తానని హామీ ఇచ్చారు. కాగా ఇరిగేషన్ అధికారులు దాదాపు రూ.150 కోట్లతో వాగుకు ఇరువైపులా కాంక్రీట్నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపారు. లేటెస్ట్టెక్నాలజీ ప్రకారం ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో మరోసారి దాదాపు రూ.30 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
శిథిలావస్థకు చేరుతున్న ఇండ్లు..
పాత కొత్తగూడెంలో గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కూలిపోయాయి. కూలి పని చేసుకుంటూ జీవించే పేదలు ఇండ్లను బాగు చేసుకోలేక వానాకాలం వచ్చిందంటే పునరావాస కేంద్రాలకు తరలి వెళుతున్నారు. తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పాలకులను కోరినా హామీలతోనే సరిపెట్టుకుంటున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. రెండున్నర కోట్లు నష్టం..
ముర్రేడు వాగు కోత కారణంగా ఐదేండ్లలో రెండున్నర ఎకరాల భూమి కోతకు గురి కాగా, పశువులు, వర్కర్స్షెడ్లు కూలిపోయాయి. పండ్ల చెట్లతోపాటు కొబ్బరి చెట్లు వరదలో కొట్టుకుపోయాయి. మొత్తం విలువ రూ.రెండున్నర కోట్లు ఉంటుంది. భూమి కోతకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలె. - ఈ. కుమారి, సంజయ్‌నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం
ఎస్టిమేషన్లను పంపించాం...
లక్ష్మీదేవిపల్లి మండలం, కొత్తగూడెం పట్టణానికి ఆనుకొని ప్రవహిస్తున్న ముర్రేడు వాగు ఉధృతి ఏటేటా పెరుగుతోంది. వాగు ఉధృతితో రెండు వైపులా భూమి కోతకు గురవుతోంది. సీఎం ఆదేశాలతో మొదట రెండు వైపులా నిర్మాణాలు చేపట్టేలా రూ.150కోట్లతో ఎస్టిమేషన్లు పంపించాం. ఉన్నతాధికారుల సూచనలతో కొత్త టెక్నాలజీ ప్రకారం రూ.30కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నాం. వాగు ఉధృతితో కోతకు గురవుతున్న ప్రాంతాల్లో దాదాపు కిలోమీటర్‌మేర మొదటి దశలో రాళ్లతో నిర్మాణాలు, రెండో దశలో మేష్తో కాంక్రీట్నిర్మాణాలు చేపట్టేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం.
అర్జున్, ఈఈ, ఇరిగేషన్, కొత్తగూడెం