జకార్తా : భూగర్భ జలాలు తోడేయడంతో కుంగిపోయిన నగరం

భూగర్భ జలాలు తోడేయడంతో కుంగిపోయిన నగరం

రాజధానిని కాలిమంతన్​కు మార్చక తప్పని పరిస్థితి

ప్రపంచ నగరాలకు ఇదో పాఠం

ప్రకృతితో పరాచికాలాడితే ఫలితం ఎలా ఉంటుందో జకార్తాని చూస్తే తెలుస్తుంది. ఇండోనేసియాకి పొలిటికల్, ఎకనమికల్​ కేపిటల్​గా ఉన్న జకార్తా ఏడాదికి పది అంగుళాల చొప్పున నీళ్లలో మునిగిపోతోంది. కాలిమంతన్​కి రాజధానిని మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. జకార్తాలో కిక్కిరిసిన జనాభా, కాంక్రీట్​ నిర్మాణాల కారణంగా భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఇప్పుడు జకార్తా పరిస్థితి గాలి తీసిన బుగ్గలా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు.

జకార్తాకి ఒక కొత్త బెడద వచ్చి పడింది. దాని ప్రభావం ఇండోనేసియాకి తగి లింది. దాంతో జకార్తా బదులుగా మరో కొత్త రాజధానికోసం వెదుకులాట మొదలైంది.  డచ్​ వాళ్ల నుంచి 1949లో స్వేచ్ఛ పొందాక అప్పటినుంచీ జకార్తాయే రాజధానిగా ఉంది. అయితే, సముద్ర జలాలతో జకార్తా కుంగిపోవడం మొదలైంది. ఏడాదికి పది అంగుళాల చొప్పున గత పదేళ్లలో 2.5 మీటర్ల మేర సముద్రంలో మునిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో ముప్పయ్యేళ్లలో నార్త్​ జకార్తా  ఏరియా 95 శాతం మేర మునిగిపోయే ప్రమాదముందని ఎన్విరాన్​మెంట్​ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. 2007లో వచ్చిన భారీ వర్షాలు, వరదలతో జకార్తా దాదాపు 13 అడుగుల మేర మునిగింది. అందువల్ల కాలిమంతన్​లో కొత్త కేపిటల్​ని కడతామని ఇండోనేసియా ప్రెసిడెంట్​ జోకోవిడోడో పార్లమెంట్​లో ప్రకటించారు.

ఇండోనేసియా ఇటు ఇండియాకి, అటు ఆస్ట్రేలియాకి నడుమ గల దీవుల సమాహారం. ఇక్కడ దాదాపు 1,700 దీవులున్నాయి. జనాభాపరంగా ప్రపంచంలోనే నాలుగో పెద్ద దేశం. ముస్లిం మతస్తులు ఎక్కువగా ఉండే ఇండోనేసియాలో మొత్తం జనాభా 26 కోట్ల 99 లక్షలు కాగా, జావా ద్వీపంలోనే సగం మంది నివసిస్తుంటారు. దేశంలో అభివృద్ధి అంతా జావాకే పరిమితమైందన్న ఆరోపణలుకూడా ఉన్నాయి. అక్కడే రాజధాని జకార్తాకూడా ఉంది. రాజధానిని జకార్తా నుంచి కాలిమంతన్​కి మార్చాలన్న నిర్ణయాన్ని వ్యాపార వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రెసిడెంట్​ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఇండోనేసియా కామర్స్​, ఇండస్ట్రీ చాంబర్​ డిమాండ్​ చేస్తోంది. జకార్తా కేంద్రంగా సాగుతున్న వాణిజ్య కార్యకలాపాలన్నీ కొత్త చోటులోకి మారాలంటే, చాలా సమయం పడుతుందన్నది చాంబర్​ అభ్యంతరం. దీనివల్ల దేశంలో వ్యాపారాభివృద్ధి మందగిస్తుందని అంటోంది.

కాలిమంతన్​లోనూ వ్యతిరేకత కనబడుతోంది.  ప్రభుత్వ ఆఫీసులు, భవనాల నిర్మాణంకోసం కాలిమంతన్​లో అడవులను నరికివేయాల్సి వస్తుంది. రాజధాని అనేసరికి అనేక హంగులు కల్పించాలి. ప్రభుత్వ భవనాలతోపాటు హోటళ్లు, షాపింగ్​ సెంటర్లు వెలుస్తాయి. ఇవన్నీ పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని అక్కడ బలంగా పనిచేస్తున్న వల్హి అనే ఎన్విరాన్​మెంటల్​ ఎన్జీవో వాదిస్తోంది. సముద్రంలో మునిగిపోవడమనేది పైకి కనిపిస్తున్న కారణమైతే… కనిపించని మరో కారణం మానవ తప్పిదం. ఇండోనేసియా మొత్తం జనాభా 27 కోట్లు కాగా, ఒక్క జకార్తా నగరంలోనే కోటిమందికి పైగా నివసిస్తున్నారు. ఈ నగరం సైజ్​ (4,384 చదరపు కిలోమీటర్లు) రీత్యా ఒక చదరపు కిలోమీటర్​ పరిధిలో దాదాపు 15,000 మంది జీవిస్తున్నారు. వీళ్లందరికీ కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం తలమునకలవుతోంది. మంచినీళ్లు, ఇళ్లు, రోడ్లు, భవనాలు వంటి సదుపాయాలకోసం జకార్తాను బాగా తవ్విపోస్తున్నారు. బయటి నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేనందున భూగర్భ జలాలను బాగా తోడుకుంటున్నారు.  దీనివల్ల జకార్తా ఉపరితలం బాగా కుంగిపోవడం మొదలైంది. గాలి లీకవుతున్న బుడగ మాదిరిగా జకార్తా నేల కుచించుకుపోతోందని ఎన్విరాన్​మెంట్​ నిపుణులు అంటున్నారు.

భూగర్భంలోకి లోతుగా బోర్లు వేసేసి నీళ్లు తోడేస్తుంటే ఎక్కడికక్కడ పగుళ్లు రావడం, భూమి ప్లేట్లు కదిలిపోవడంవంటివికూడా జరుగుతున్నాయని చెబుతున్నారు.ఇదే సమస్య వల్ల అమెరికాలోని ఫ్లోరిడా నగరంకూడా కొంత కుంగిపోయిందని చెబుతున్నారు. అలాగే, అధిక జనాభాకూడా జతకావడంతో భూమి కుంగుబాటు మరింత వేగంగా సాగుతోంది.  సముద్రం కంటే దిగువ లెవెల్​కి జకార్తా నగరం తగ్గిపోయి, ఏమాత్రం భారీ వర్షం కురిసినా నీరు నిలిచిపోతోంది. కొన్ని ప్రాంతాలైతే శాశ్వతంగా నీళ్లలోనే ఉంటున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. అదీగాక, జకార్తాలో పచ్చదనం క్రమంగా కనుమరుగైపోయింది. భవనాలు, రోడ్లు, బ్రిడ్జిలు కడుతూ పోవడంతో జకార్తా మొత్తం కాంక్రీట్​ జంగిల్​గా మారింది. వర్షపు నీళ్లు ఇంకడానికిగానీ, నగరంలో వాతావరణం సీజన్​ ప్రకారం ఉండడానికిగానీ ఎలాంటి సహజ వాతావరణం లేని పరిస్థితిలో ఇప్పుడు ఉంది. కొన్ని చోట్ల భవనాలు, రోడ్లు పగుళ్లుదీయడం కామన్​గా తయారైంది. దీనికి పరిష్కారంగా జకార్తాకి చాలా దూరంగా భారీ రిజర్వాయర్​ని నిర్మించాలని, అక్కడి నుంచి పైపుల ద్వారా కేపిటల్​ అవసరాలకోసం నీటి సరఫరా చేయాలని హైడ్రాలజిస్టులు సూచిస్తున్నారు. కొత్తగా కట్టాలనుకుంటున్న ప్రాంతం ప్రస్తుతానికి మంచి గ్రీనరీతో ఉంది. అయితే, వచ్చే పదేళ్లలో అక్కడ కొత్త కేపిటల్​ని పూర్తి చేస్తామని ప్రెసిడెంట్​ జోకోవిడోడో చెబుతున్నారు. ఒకసారి కేపిటల్​ నిర్మాణం మొదలైందంటే అడవుల్ని కొట్టేయడం​ వేగంగా సాగుతుందని, కాంక్రీట్​ జంగిల్​గా మారిపోవడం ఖాయమని పర్యావరణవేత్తలు ఆందోళన పడుతున్నారు.

ఇప్పటికి ఆరుసార్లు మారింది

మనం ఎలాగైతే బ్రిటిషర్లతో పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామో… ఇండోనేసియావాళ్లుకూడా అలాగే డచ్​ వాళ్లతో ఫైట్​ చేసి ఇండిపెండెన్స్​ సాధించారు. డచ్​ (హాలండ్​) ఈస్టిండీస్​ పేరుతో 1670 నుంచి 1900 వరకు పాలన సాగించింది. 1901 నుంచి లోకల్​గా పరిపాలనకు చోటు కల్పించారు. 1942లో ఈస్టిండీస్​ ఏరియాని జపాన్​ ఆక్రమించింది. అదే సమయంలో సుకర్ణో నాయకత్వంలో గెరిల్లా పోరాటం సాగింది. జకార్తా రాజధానిగా సుకర్ణో వేరే ప్రభుత్వాన్ని నడిపేవారు.  1945లో ఇండిపెండెన్స్​ ఉద్యమం తీవ్రమయ్యేసరికి నెదర్లాండ్స్​ ఇండీస్​ సివిల్​ అడ్మినిస్ట్రేషన్​ (ఎన్సీసీఏ) యోగ్యకర్త అనే ఊరికి రాత్రికి రాత్రే కేపిటల్​ని మార్చేసింది. మూడేళ్లు గడిచాక రాజధానిని యోగ్యకర్త నుంచి బుకిట్టింగీకి మార్చారు. మొత్తంగా చూస్తే.. ఇండోనేసియా రాజధాని జకార్తా, యోగ్యకర్త, బుకిట్టింగీల మధ్య ఆరుసార్లు మారింది. కాలిమంతన్​కి మార్చినట్లయితే ఏడోసారి కేపిటల్​ని మార్చినట్లవుతుంది.

కాలిమంతన్ సంస్కృత పేరే!

బ్రూనే, ఈస్ట్​ మలేసియా, ఇండోనేసియాల ఉమ్మడి ద్వీపం బోర్నియో. దీనిలో ఇండోనేసియాకి చెందిన ప్రాంతంలో కాలిమంతన్​ ఉంది. ఇది మొత్తం దీవిలోని 73 శాతం మేర విస్తరించిన ప్రాంతం. కాలిమంతన్​ని స్థానికులు క్లెమంతన్​గా వ్యవహరిస్తారు. సంస్కృత పదమైన ‘కాలమంథన’ నుంచి పుట్టిన పేరు. బోర్నియోలో వేడి వాతావరణం కారణంగా ‘కాలమంథన (ఉష్ణ ద్వీపం)’గా పిలవసాగారు. కాల అంటే రుతువు, మంథన్​ అంటే రగులుతుండడం. జనం వాడుకలో ఇది కాలమంతనగా, క్లెమంతనగా మారిపోయింది. ఈ ప్రాంతాన్ని ఇండోనేసియన్​ బోర్నియోగా పేర్కొంటారు.