ఇప్పటివరకూ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితేనో లేదంటే వెలుతురు తక్కువగా ఉందనో మ్యాచ్ ఆపేయడం చూసుంటారు. అంతకూ కాదంటే ప్రకృతి కన్నెర్ర జేస్తే మ్యాచ్ ఆపేయడం చూసుంటారు. ఈ ఘటన అలాంటి వాటికి విభిన్నం. అంపైర్ ఔట్ ఇచ్చారని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆడటానికి నిరాకరించారు. దీంతో అంపైర్లు మరో జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టకుండానే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజేతగా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు గల్లీ క్రికెట్‌లో కనిపిస్తుంటాయి. అలాంటిది ద్వైపాక్షిక సిరీస్‌లో చోటుచేసుకోవడం గమనార్హం.
ఏం జరిగిందంటే..?
ఇండోనేసియా, కంబోడియా జట్ల మధ్య 7 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో నవంబర్ 22 వరకు ఐదు మ్యాచ్‌లు జరగగా.. మూడింటిలో ఇండోనేసియా.. మరో రెండింటిలో కంబోడియా విజయం సాధించచాయి. అనంతరం గురువారం(నవంబర్ 23)న ఈ ఇరు జట్ల మధ్య ఆరో టీ20 జరిగింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కంబోడియా 11.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
ఈ క్రమంలో ఇండోనేసియా బౌలర్ ధనేశ్ కుమార్ శెట్టి వేసిన 12 ఓవర్ మూడో బంతికి కంబోడియా బ్యాటర్ లక్మన్ బట్ (20) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇండోనేషియా ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ వెంటనే ఔట్గా ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయాన్ని కంబోడియా ప్లేయర్లు ఒప్పుకోలేదు. బ్యాట్ తాకలేదని బ్యాటర్ మొండికేయగా.. ఆ ఔట్ కాస్తా వివాదాస్పదమైంది. అంపైర్లు వారిని ఎంత బుజ్జగించినా వెనక్కు తగ్గలేదు. ఔట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటేనే ఆడతామని మొండికేశారు. దీంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇండోనేసియా జట్టును విజేతగా ప్రకటించారు.
ఈ కారణంగా సిరీస్‌లో మిగిలివున్న మరో మ్యాచ్లో కూడా రద్దైంది. దీంతో ఇండోనేసియా జట్టు 4-2 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఏ జట్టూ స్పందించలేదు. ఈ ఘటనను చూసి క్రికెట్ ప్రేమికులు వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
Something weird has gone down in the Indonesia v Cambodia T20I series. pic.twitter.com/YyNcifMNRu
— Andrew Nixon (@andrewnixon79@mastodon.world) (@andrewnixon79) November 23, 2023