
సమ్మర్ టూర్స్ ప్రారంభమయ్యాయి. వేసవి సీజన్లో ఫ్యామ్లీ ట్రిప్స్ ఉంటాయి. అందంతో.. వేడికి సేద తీరే జలపాతాలున్న ప్రదేశాలకు వెళ్లేందుకు జనాలు ఆశక్తి చూపుతారు. ఈ రెండిటితో పాటు పరిశుభ్రం కూడా అవసరం. అలాంటి నగరంలో మనదేశంలోనే ఉంది.. ఎంతో క్లీన్ ఉండే ఇండోర్ నగరం బ్యూటీ అంతా ఇంతా కాదు.. అక్కడ ఉండే రాల మందల్ అటవీ ప్రాంతం... పాతాళి పాని వాటర్ ఫాల్స్.. గణేష్ టెంపుల్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో సమ్మర్టూర్ప్లాన్ చేసుకొంటే.. అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారు. క్లీన్ సిటీ ఇండోర్ గురించి స్పెషల్స్టోరీ....
దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరం ఇండోర్... విదేశీ సర్వేలలో కూడా ఇండోర్ నగరం పరిశుభ్ర నగరంగా నిలిచింది. అందుకే ఈ నగరాన్ని ఒక్కసారైనా సందర్శించి, ఇక్కడి పరిశుభ్ర వాతావరణాన్ని చూడాలని చాలా మంది అనుకుంటారు. క్లీన్ నెస్ ఒక్కటే కాదు.. ఇక్కడ పర్యాటకుల్ని ఆకర్షించే అనేక విషయాలున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇండోర్ పరిశుభ్రంగా ఉంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మన దేశంలో పర్యాటకులు మెచ్చే నగరాల్లో ఇదీ ఒకటి. 20 లక్షలు పైగా జనాభా కలిగిన ఈ నగరం సందర్శకులకు మంచి అనుభూతిని అందిస్తోంది. ఈ నగరంతోపాటు చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
పాతాళి పాని వాటర్ ఫాల్స్
ఇండోర్ కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'పాతాళ్ పాని వాటర్ ఫాల్స్' కచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశం. దాదాపు 300 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు పడే దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవి, పర్వతాలు మరింత అందంగా కనిపిస్తాయి. ట్రెక్కింగ్ చేసే వాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. పర్వతం దిగువన పైనుంచి జారే జలపాతాన్ని చూస్తూ, నచ్చిన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు.
వర్షాకాలంలో ఈ జలపాతాన్ని సందర్శిస్తే బాగుంటుంది. దీనితోపాటు టించా ఫాల్స్ అనే మరో జలపాతం ఇండోర్ కు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపు మూడు వందల అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి జాలువారుతుంది.
ఖజానా గణేశ్ టెంపుల్
ఇండోర్ నగరంలో ప్రత్యేకంగా నిలిచే దేవాలయం ఇది.దాదాపు 300 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయం ఇది. అహల్యా బాయ్ హోల్కర్ అనే రాణి ఈ గుడిని నిర్మించింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వినాయక విగ్రహం ఈ గుడిలో ఉంది. ఈ విగ్రహం దాదాపు 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇతర దేవతల కోసం పక్కనే కొన్ని చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. విభిన్న నిర్మాణ శైలితో ఉన్న ఈ గుడి ప్రదేశం అంతా మనసుకు ప్రశాంతతను అందిస్తుంది.
ఇండోర్ లోనే ఉన్న మరో ప్రత్యేక దేవాలయం కంచ్ మందిర్, ఈ జైన దేవాలయ నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. గోడలు, సీలింగ్, బెల్జియన్ స్టెయిన్ గ్లాస్, మిర్రర్స్, మెట్లు, లోపలి కళాఖండాలు వంటివి ఈ దేవాలయంలోని ప్రధాన ఆకర్షణలు. ఈ గుళ్లతోపాటు అన్నపూర్ణ టెంపుల్' కూడా మరో చూడదగిన ప్రదేశం.
రాజ్ వాడ ప్యాలెస్
1747లో నిర్మితమైన రాజ్వాడ ప్యాలెస్' ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. దీన్ని మలోహార్ రావ్ హోల్కర్ అనే రాజు నిర్మించాడు. మొఘలులు, యూరోపియన్లు సహా విదేశీ నిర్మాణ శైలిని అనుసరించి దీన్ని నిర్మించారు. రాచరికపు నిర్మాణశైలి ఉట్టిపడే ఈ ప్యాలెస్ పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. దీంతోపాటు 'లాల్ 'బామ్ ప్యాలెస్' కూడా మరో ఆకర్షణ.
రాలమందల్ అభయారణ్యం
ఐదు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన 'రాలమందల్ అభయారణ్యం' 1989లో ఏర్పాటైంది. అనేక రకాల మొక్కలు, వృక్షాలు, జీవజాలం దీని పరిధిలో కనిపిస్తుంది.. అందమైన ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వాళ్లకు ఈ ప్రదేశం ఎంతగానో నచ్చుతుంది. ట్రెక్కింగ్ సౌకర్యం ఉంది. 'చిరుతలు, సాంబార్, జింక వంటి అనేక జంతువులు, బబుల్ బ్యాంబూ, యూకలిప్టస్ వంటి చెట్లు, రకరకాల పక్షులు ప్రధానంగా ఆకట్టుకుంటాయి. వాహనాల్లో వెళ్లి, ఈ జీవుల్ని చాలా దగ్గర్నుంచి చూసే వీలుంది.
– వెలుగు,లైఫ్–