మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖర్గోన్ జిల్లాలో ఓ బస్సు బోల్తా పడింది. బోరాడ్ నదిపై వంతెనపై నుంచి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే రవి జోషి కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తామని వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50,000, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25,000 తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది.