రైతులు, ఫైనాన్షియర్లకు కుచ్చు టోపీ.. ఇందూర్ గంజ్​వ్యాపారి రూ.15 కోట్లు ఎగవేత

రైతులు, ఫైనాన్షియర్లకు కుచ్చు టోపీ..  ఇందూర్ గంజ్​వ్యాపారి రూ.15 కోట్లు ఎగవేత

నిజామాబాద్, వెలుగు: ఇందూర్​మార్కెట్​కమిటీ గంజ్‎లో పేరొందిన కమీషన్​ఏజెంట్​బోర్డు తిప్పేశాడు. రైతులు, ఫైనాన్షియర్లకు సుమారు రూ.15 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం రేపుతోంది. రక్షణ కోసం లోకల్​ కోర్టులో ఐపీ (దివాలా) పిటిషన్​దాఖలు చేయగా.. గత నెల 27న ఫస్ట్​ హియరింగ్​జరిగింది. తదుపరి ఈనెల​31కి వాయిదా పడింది. పిటిషన్‎లో తాను బాకీ ఉన్న 45 మంది పేర్లను పేర్కొంటూ వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు. ఏండ్ల తరబడి గంజ్‎లో కమీషన్​ఏజెంట్‎గా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తి  రైతుల వద్ద నమ్మకం ఏర్పర్చుకొని వ్యాపారం చేస్తున్నాడు. 

ఆ నమ్మకంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు అతనికి రూ.మూడున్నర కోట్ల విలువైన పసుపు అమ్మినట్లు తెలుస్తోంది. ఒకరికి తెలియకుండా మరొకరి నుంచి పసుపు కొనుగోలు చేశాడు. తన వద్ద పసుపు స్టాక్‎ను చూపి గంజ్‎లోని 10 మంది పెద్ద ఫైనాన్షయర్ల వద్ద రూ.11 కోట్ల అప్పు తీసుకున్నట్లు సమాచారం. పేమెంట్​చేయాల్సిన సదరు ఏజెంట్​అందుబాటులో లేడు. షాప్​ఓపెన్​ చేయకపోవడంతో పాటు ఫోన్​చేసినా ఎత్తకపోవడంతో బాధితుల్లో రెండు వారాల నుంచి అనుమానం మొదలైంది. ఇప్పుడు ఐపీ పిటిషన్​వేసినట్లు తెలిసి లబోదిబోమంటున్నారు.