- స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మున్సిపల్ కార్పొరేషన్ వరుసగా ఎంపిక
- అధికారుల ముందు చూపు,సమగ్ర ప్రణాళికలతోనే ఫస్ట్ ప్లేస్
- ర్యాంకింగ్ మెరుగుపరుచుకునేందుకు బల్దియా ఆరాటం
- అధికారుల కార్యాచరణ లోపమే కారణమంటున్న గ్రేటర్ ప్రజలు
విశాలమైన రోడ్లు .. మధ్యలో ఎట్రాక్టివ్ గా పూలమొక్కలు,పాదచారులకు అనుకూలంగా ఫుట్ పాత్ లు, చూద్దా మన్నా కనిపించని చెత్త, రెండు కిలో మీటర్లకు ఒక పబ్లిక్ టాయ్ లెట్ , నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే పందులు,పశువులు రాకుండా పహారా, పక్కాగా పారిశుద్ధ్య నిర్వహణ, జీపీఎస్ సిస్టమ్ తో మున్సిపల్ వెహికల్స్ నిరంతర పర్యవేక్షణ. స్వచ్ఛ ఇండోర్ ప్రత్యేకతలివి. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్ కాంపిటీషన్ లో హ్యాట్రిక్ కొట్టి ‘క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా’గా గుర్తింపు పొందిందీ నగరం. కొత్తగా ప్రవేశపెట్టిన సెవెన్ స్టార్ రేటిం గ్ నూ మొదటగా దక్కించుకునేం దుకు సిద్ధమవుతుండగా, జీహెచ్ఎంసీ మాత్రం తన స్థా నాన్ని మెరుగుపర్చుకునేం దుకు కిందా మీదా పడుతోంది . విం టర్ లోనూ సగటున నిత్యం పాతికకు పైగా డెంగ్యూ కేసులు నమోదవుతుండడమే మన విశ్వనగర స్వచ్ఛతకు నిదర్శనం! – హైదరాబాద్, వెలుగు
హైదరాబాద్, వెలుగు : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏడాది కిందట ప్రవేశపెట్టిన సెవన్ స్టార్ రేటింగ్‌ను ఫస్ట్ టైం దక్కించుకునేందుకు ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరాటపడుతోంది. ఇది ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జారీ చేసే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్టిఫికేషన్‌లో వరుసగా మూడు సార్లు టాప్ వన్ లో నిలిచి హ్యాట్రిక్ కొట్టింది. ఇక మన బల్దియా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకునేందుకు ఇంట్రస్ట్ పెట్టినా ప్లాన్డ్గా ముందుకెళ్లడం లేదనే విమర్శలు గ్రేటర్ ప్రజల నుంచి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించి, దేశంలోని ప్రధాన నగరాల్లో స్వచ్చత, ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రోత్సహిస్తోంది. కాగా మూడు సార్లు ఇండోర్ ‘క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా’గా సర్టిఫికెట్ సాధిస్తోంది. ప్రణాళికబద్ధంగా అధికారులు తమ కార్యచరణను అమలు చేస్తుండంతో నగర ప్రజలు తమ బాధ్యతగా భావిస్తుండటంతో ఇది సాధ్యమైందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇండోర్‌లో 84 వార్డులు ఉండగా.. మన గ్రేటర్‌లో 150 వార్డులు ఉన్నాయి.
ఇండోర్ విజయ రహస్యాలు కొన్ని..
2017, 18, 19 సంవత్సరాల్లో దేశంలోని వందల వెనక్కినెట్టి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్టిఫికేషన్‌లో ఇండోర్ సిటీ ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచింది. స్వచ్ఛత ర్యాంకింగ్‌ను గుర్తించేందుకు కొత్తగా తీసుకొచ్చిన సెవెన్‌స్టార్‌ను కూడా ఇండోర్ ఈసారి దక్కించుకోనుంది. ఈ విభాగంలో అర్హత సాధించేందుకు ప్రమాణాల్లో జీహెచ్‌ఎంసీ వెనకబడింది. ప్రస్తుతం 800/1000 మార్కులతో 5 స్టార్ రేటింగ్‌లో 12వ స్థానంలో బల్దియా నిలుస్తోంది. అక్షరాస్యతలో హైదరాబాద్‌కు , ఇండోర్‌కు పెద్దగా తేడా లేకున్నా జనాభా, స్వచ్ఛత విషయంలో అనుసరిస్తున్న ప్రమాణాలు, ప్రజల అవగాహన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్టిఫికెట్ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. శానిటేషన్, పారిశుద్ధ్యం, చెత్త తరలింపు, డంపింగ్ కేంద్రాలు, రోడ్ల మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు అమలు చేస్తున్నా ప్రణాళికలు, కార్యాచరణను సరిగా అమలు చేయడంలో భారీ తేడా కనబడటమే మన నగరం వెనకబడటానికి కారణంగా తెలుస్తోంది.
ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. ఏడు పద్ధతులు పాటిస్తూ
ఇండోర్‌లో చెత్త సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ ఏడు పద్ధతులను వారు తమ సామాజిక జీవనంలో భాగంగా చేసుకోవడంతోనే ఇది సాధ్యమైందని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వివరిస్తున్నారు.
- తడి, పొడి చెత్త వేర్వేరుగా : మున్సిపల్ కార్పొరేషన్ ముందుగా రోడ్లపై కలర్ బాక్స్‌లను ఏర్పాటు చేసింది. ప్రజలు నుంచి అంతగా స్పందనలేదు. దీంతో ఇంటింటికి చెత్త సేకరణ చేయడం మొదలుపెట్టింది. ఇండ్లు, దుకాణాల నుంచి నేరుగా పారిశుద్ధ సిబ్బందికి ఇచ్చే పద్ధతిని అలవాటు చేశారు. ఇంటి వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా ఉంచడంతో వాటిని పారేయడం సులువైంది.
- ఇంట్లోనే కంపోస్టు తయారీ: ఇంట్లోనే వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడం ప్రజలు అనుసరిస్తున్నారు. ఉదాహరణకు లోక్‌మాన్యనగర్‌లో 750 కుటుంబాలు టెర్రకోట కుండల్లో కంపోస్ట్ తయారు చేసే బిజినెస్ చేస్తున్నాయి. వారానికి రెండు సార్లు మాత్రమే చెత్తను మున్సిపల్ సిబ్బందికి ఇస్తున్నాయి. తడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ తయారీకి వాడతారు. తోటలు, హోటళ్లు, స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో కలిపి మరో 700కి పైగా కంపోస్ట్ తయారీ యూనిట్లు ఉన్నాయి. దీంతో బయట చెత్తను పారేయడం తగ్గిపోయింది.
- రూల్స్ మేరకే ప్లాస్టిక్ వాడకం: చెత్త ఉత్పత్తిలో ప్లాస్టిక్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. రోజు వారీగా చెత్తను వేరు చేస్తే అందులో అధికంగా ప్లాస్టిక్ ఉత్పత్తులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. కార్పొరేషన్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించింది. రూల్స్ ప్రకారం మాత్రమే ప్లాస్టిక్ వాడకం చేస్తున్నారు. దీంతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు చెత్త ఉత్పత్తి తక్కువగా ఉంది.
- డస్ట్‌బిన్ ఆన్ ది వీల్స్ : ఇది పూర్తిగా ఒక కొత్త ఆలోచన. ప్రజలు తమ కార్లలో చిన్న డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసుకున్నారు. తినే పదార్థాల వేస్టేజ్‌కు సంబంధించి బయట పడేయరు. పాన్, గుట్కాను నమిలి ఊసేందుకు కార్లలో ప్రత్యేక డబ్బాలు ఉంటాయి.
- పిల్లల్లో అవగాహన: ఓపెన్ ఏరియాల్లో చెత్తను పడేయకుండా చూడడంలో పిల్లలే టాప్. స్కూళ్లలో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ చెత్త చెదారం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తుంటారు. పిల్లలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా పెద్ద పెద్దవాళ్లు రోడ్లపై చెత్తను వేస్తే క్రమశిక్షణగా ఉండేలా పిల్లలు చేస్తున్నారు.
6.ఫంక్షన్లు, దావత్‌ల్లో: ఫంక్షన్లు, దావత్‌లు, ఇతర ఏవైనా ఈవెంట్లు, మీటింగ్‌లు జరిగినపుడు ఆ ప్రాంతాల నుంచి చెత్త వ్యర్థాలు బయటకు వెళ్లకుండా ప్రజలు చూస్తున్నారు. కార్యక్రమాలు ముగిసిన వెంటనే క్లీన్ చేసే బాధ్యతలను ప్రజలే తీసుకున్నారు.
- పెండ్లి నాటి ప్రతిజ్ఞ: హిందూ కల్చర్‌లో భాగంగా పెండ్లిలో చేసే ప్రమాణాల్లో ‘పరిశుభ్రత’ ప్రమాణం భాగమైపోయింది. వివాహ ఆచారాల్లో నూతన వధూవరులు పరిశుభ్రతపై ప్రమాణం చేస్తారు. వివాహ వేడుకల్లో డస్ట్‌బిన్లను కూడా పంపిణీ చేస్తారు.
మన వద్ద ఇలా చేస్తే..
ఇండోర్‌లో మూడేండ్ల నుంచి ప్లాన్డ్గా చేయడంతోనే ఇది సాధ్యమైంది. ప్రజల్లో అవేర్‌నెస్ తెచ్చేందుకు అధికారులు ఇలా చర్యలు చేపట్టారు. ప్రతీరోజు వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా.. ఇంటి వద్ద నుంచే తడి, పొడి చెత్తను వేరే చేసి తీసుకెళ్లడం, డంపింగ్ యార్డ్‌లోకి చేర్చడం అంతా పద్ధతిగా ఉంటుంది. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌తో పాటు రోడ్స్ క్లీనింగ్ కు మెషీన్లను వాడుతున్నారు. 2014లో క్యూబిక్ మీటర్ గాలిలో 142 ఎంజీ (మైక్రోగ్రాము) ల దుమ్ము, ధూళి ఉండగా, 2017లో 76 ఎంజీ( మైక్రో గ్రాము)లకు పడిపోయింది. మన గ్రేటర్‌లోనూ వార్డుల వారీగా ప్రత్యేకంగా పారిశుధ్యం, శుభ్రత, చెత్తను వేర్వేరుగా చేసి కార్మికులకు అందించడం వంటి చర్యలపైనా అవగాహన కల్పించారు. ఒక వార్డు లేదా సర్కిల్ స్థాయిలో వంద శాతం రిజల్ట్ వచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇలా సిటీ అంతా విస్తరిస్తూ అధికారులు ప్లాన్డ్గా చేస్తే పూర్తి స్థాయిలో క్లీన్‌గా ఉంచడం పెద్ద కష్టం కాదని పలువురు సూచిస్తున్నారు. ఓపెన్ ఏరియాల్లో మూత్ర విసర్జనను నిర్మూలించేందుకు పెట్రోల్ బంక్‌లు, హోటళ్లు, ఆస్పత్రులు, పబ్లిక్ టాయిలెట్లను వాడుకోవాలని స్వచ్ఛ సర్వేక్షణ్ అధికారులు సూచిస్తున్నారు.
నాలుగేండ్లకు ముందే ప్లాన్
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఒక్కరోజులోనే ఇది సాధించలేదు. నాలుగేండ్ల ముందే ప్లాన్ చేసి, పకడ్భందీగా అమలు చేయడంతో సాధ్యమైంది. నగరాన్ని క్లీన్‌గా ఉంచేందుకు అధికారులు, సిబ్బంది నాలుగు రూల్స్‌ను అమలు చేస్తున్నారు.
- చెత్త డబ్బాల తొలగింపు : ఓపెన్ ఏరియాల్లోని చెత్త డబ్బాలతో ఆ ప్రాంతాలు మురికిగా మారుతుండడంతో పాటు కుక్కలు, ఇతర జంతువులు చెత్తను వెదజల్లినట్టు చేస్తున్నాయి. దీన్ని నివారించేందుకు అన్ని ఏరియాల్లోని చెత్త డబ్బాలను తొలగించారు. ప్రతిరోజూ మున్సిపల్ సిబ్బందే ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా చర్యలు తీసుకున్నారు.
- రాత్రిపూట చెత్త ఊడ్చడం: మున్సిపల్ సిబ్బంది ఉదయం పూట రోడ్లను ఊడ్చే విధానాన్ని అధికారులు మార్చివేశారు.సాయంత్రం పూట వ్యాపార కేంద్రాల నుంచి ఆ రోజులో ఉత్పత్తి అయిన చెత్తను సేకరించడం ప్రారంభించారు. అదేవిధంగా రాత్రి పూట రోడ్లను, మార్కెట్ స్థలాలను శుభ్రపరిచే విధానం చేస్తూ ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
- మున్సిపల్ ట్రక్కుల ప్రత్యేక డిజైన్లు : దేశంలోని ఇతర సిటీలో 1.8 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల చెత్త సేకరించే ట్రక్కులు పని చేస్తున్నాయి. వీటితో 300 ఇండ్ల నుంచి చెత్తను సేకరించడం సాధ్యమవుతుంది.అయితే మునిసిపల్ అధికారులు ప్రత్యేకంగా 3.3 క్యూబిక్ మీటర్ చెత్త సామర్థ్యం గల వెహికల్స్‌ను రూపొందించి వినియోగిస్తున్నారు. ఒక ట్రక్కు ద్వారా వెయ్యి ఇండ్ల నుంచి చెత్తను ఒకేసారి తరలించేలా తయారు చేశారు.
- పిల్లలే బ్రాండ్ అంబాసిడర్లు : నేటి బాలలే రేపటి భావిపౌరులు సత్యాన్ని కార్పొరేషన్ గుర్తిస్తూ శుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్లు గా పిల్లలను నియమించారు. తమ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉండేలా స్కూళ్లు, కాలేజీల్లో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇవి సక్సెస్ కావడంతో యూపీలోని ఘజియాబాద్, కాన్పూర్, గుజరాత్‌లోని అహ్మదాబాద్ వంటి నగరాలు ఈ ‘చిల్డ్రన్ అంబాసిడర్’ ప్రయోగాలు అమలు చేస్తున్నాయి.
గ్రేటర్‌లో పరిస్థితి ఇలా..
గ్రేటర్‌లో పారిశుద్ధ్య కార్మికుల నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన అధికారుల వరకూ మొత్తం 36 వేల మంది శానిటేషన్ విభాగంలో ఉన్నారు. ఇందులో18 వేల మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లను శుభ్రపరిచే పనులు చేస్తున్నారు. నగరంలో చెత్త సేకరించేందుకు ప్రస్తుతం 2,500 ఆటోలు నడుస్తుండగా.. మరో 1000 అవసరం. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరించేందుకు వేర్వేరుగా కలర్ డస్ట్ బిన్లను ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అందించింది. అయితే ప్రస్తుతం ఇవి పూర్తి స్థాయిలో ఉపయోగించడం లేదు. ఓపెన్ ఏరియాల్లో మూత్ర విసర్జన చేస్తే రూ. 100 ఫైన్ వేస్తున్నారు. అయితే ఓడీఎఫ్ చర్యలను నివారించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సిబ్బంది లేరు. సిటీలో కేవలం వెయ్యి మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి. డంపింగ్ యార్డుల్లో సరైన నిర్వాహణ లేక సమీప ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జవహర్ నగర్, జియాగూడ, ఆటోనగర్ డంపింగ్ యార్డుల నుంచి వచ్చే దుర్వాసన, పొగతో తీవ్ర శ్వాస ఇబ్బందులను ఎదుర్కుంటున్నామని ఆందోళన చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 18 సీవరేజ్ ట్రీట్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవి 1,350 ఎంఎల్‌డీ సామర్థ్యంతో పనిచేయాల్సి ఉండగా, కేవలం 750 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నాయి. ఇండోర్‌లో తీసుకుంటున్న చర్యల ద్వారా అంటువ్యాధుల తీవ్రత 70 తగ్గిపోయింది. మన వద్ద ఉన్న మురుగు కారణంగా డెంగ్యూ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడడం ప్రతీ సీజన్‌లో కామన్‌గా మారిపోయింది. దుమ్ము, ధూళి తీవ్రత కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో ఓపెన్ ఎయిర్ ఫ్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కూడా బల్దియా అధికారులు పరిశీలిస్తున్నారు. స్వచ్ఛ చర్యలను సమగ్రంగా, నిబద్ధతతో చేపడితే బల్దియా ఇలాంటి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు గ్రేటర్ ప్రజలకు మంచి సేవలు అందించవచ్చు.