కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వేచ్ఛా వాయు సర్వేలో 10 లక్షలు మించి జనాభా కలిగిన నగరాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత వరుసలో ఆగ్రా (యూపీ), ఠాణె (మహారాష్ట్ర)లు చేరాయి. ఈ సమాచారాన్ని 2023, సెప్టెంబర్ 7న కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ పేరిట కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ(సీపీసీబీ) ఈ సర్వేను నిర్వహించింది.
జాతీయ స్వేచ్ఛా వాయు కార్యక్రమం కింద 131 నగరాల్లో నగర కార్యాచరణ ప్రణాళిక, వాయు నాణ్యత కింద ఆమోదించబడిన కార్యకలాపాలు అమలు ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. రెండో విభాగంలో మూడు నుంచి 10 లక్షల లోపు జనాభా గల నగరాల్లో మహారాష్ట్రలోని అమరావతి తొలి స్థానం దక్కించుకోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొరాదాబాద్ రెండు, ఏపీలోని గుంటూరు మూడో స్థానంలో నిలిచాయి.
మూడు లక్షల లోపు జనాభా గల నగరాల్లో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పర్వానూ మొదటి ర్యాంకు సాధించింది. ఆ రాష్ట్రానికే చెందిన కాలా అంబ్, ఒడిశాలోని అంగుల్ రెండు, మూడు ర్యాంకులు పొందాయి. 2024 నాటికి దేశంలో పీఎం 2.5, పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల స్థాయిని 20 నుంచి 30 శాతం తగ్గించాలని ఎన్సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.