- ఇండోర్ ఆస్పత్రిలో మరో 16 మందికి చికిత్స
- బాధితులను పరామర్శించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
- ప్రమాదం జరిగిన ఆలయానికి వెళ్లి పరిశీలన
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన మెట్ల బావి ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు పెరిగింది. ‘‘ఇప్పటివరకు 36 డెడ్ బాడీలను బావి నుంచి బయటకు తీశాం. ఈ ప్రమాదంలో గాయపడిన 16 మందిని ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. స్వల్ప గాయాలైన ఇద్దరికి ట్రీట్మెంట్ అందించి ఇంటికి పంపించాం” అని ఇండోర్ డివిజనల్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ శుక్రవారం తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిస్సయినట్టు రిపోర్టు అయిన అందరి డెడ్ బాడీలు వెలికితీశాం. అయినప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. బావిలోని పూడిక మొత్తం తొలగించి చూస్తం” అని చెప్పారు. సెర్చ్ ఆపరేషన్‌లో ఆర్మీ, ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు పాల్గొన్నాయని తెలిపారు. ఇరుకైన ప్రదేశంలో గుడిని కట్టడం, బావిలోని నీటిని తోడేందుకు ఇబ్బందులు తలెత్తడంతో సెర్చ్ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పారు. ‘‘అసలేం జరుగుతుందో మాకు అర్థం కాలేదు. ఒక్కసారిగా స్లాబ్ కూలిపోయింది. దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేస్తున్న కొందరు.. అట్లనే బావిలో పడిపోయారు. బావి అంచు మీద నిలబడడంతో బతికి బయటపడ్డాను” అని ఓ భక్తుడు చెప్పాడు. కాగా, గురువారం రామ నవమి వేడుకలు జరుగుతున్న టైమ్‌లో బేలేశ్వర్ ఆలయంలో మెట్ల బావిపై వేసిన స్లాబ్ కూలడంతో భక్తులు అందులో పడిపోయారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటం: సీఎం చౌహాన్
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్న బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ఆలయానికి వెళ్లి పరిశీలించారు. అయితే ఆ టైమ్ లో కొంతమంది స్థానికులు నిరసన తెలిపారు. ‘ముర్దాబాద్, షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశారు. స్పాట్ ను పరిశీలించిన తర్వాత చౌహాన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇలాంటి దుర్ఘటన మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఇలా ప్రమాదకరంగా స్లాబ్ లు వేసి మూసేసిన మెట్ల బావులు, బావులు ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటం. ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాం. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటం” అని ఆయన తెలిపారు.
ఏడాది కింద స్థానికుల ఫిర్యాదు..
పార్కు స్థలం కబ్జా చేసి ఆలయం కట్టారని ఏడాది కింద మున్సిపాలిటీలో స్థానికులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని వారు అంటున్నారు. ఈ టెంపుల్ ప్రైవేట్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉంది. పార్కు స్థలం కబ్జా చేసి వాటర్ ట్యాంక్ కట్టారని, ఆ తర్వాత మెట్లబావిపై ఆలయం నిర్మించారని, పార్కు స్థలంలోనే మరో ఆలయం కడుతున్నారని ఫిర్యాదులో స్థానికులు పేర్కొన్నారు. దీనిపై ట్రస్టు సెక్రటరీకి మున్సిపాలిటీ నోటీసులు ఇవ్వగా.. అలాంటిదేంలేదని, మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఆయన రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.