అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అక్క కుప్పకూలిపోయారు..కారణం ఒక్కటే

అప్పుడు తమ్ముడు..ఇప్పుడు అక్క కుప్పకూలిపోయారు..కారణం ఒక్కటే
  • డ్యాన్స్​చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువతి
  • గతంలో పన్నెండేండ్ల ఆమె తమ్ముడు కూడా మృతి.. మధ్యప్రదేశ్​లో ఘటన 

విదిశ: మధ్యప్రదేశ్​లోని విదిశలో ఓ పెండ్లి వేడుకలో పరిణీత జైన్ (23) డ్యాన్స్​ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయింది. గతంలో ఆమె తమ్ముడు కూడా 12 ఏండ్ల వయసులో హార్ట్​ఎటాక్​తో చనిపోయినట్టు సమాచారం. 

పరిణీత జైన్​ఎంబీఏ పూర్తి చేసి ఇండోర్‌‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. బంధువుల పెండ్లికి హాజరయ్యేందుకు శనివారం విదిశకు వచ్చింది. సంగీత్ లో డ్యాన్స్​చేస్తూ పరిణీత ఒక్కసారిగా కుప్పకూలింది. 

బంధువులలో కొంతమంది డాక్టర్లు ఉండడంతో సీపీఆర్​చేసి పరిణీతను బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే ఆమెను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో యువతి చనిపోయిందని ప్రకటించారు. 

కాగా, పన్నెండేండ్ల వయసులో ఆమె తమ్ముడు కూడా ఇదే విధంగా గుండెపోటుతో చనిపోయాడని బంధువులు తెలిపారు. ఇటీవలి కాలంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు, చిన్న వయసులోనే స్పోర్ట్స్​ఆడుతూ, డ్యాన్స్​చేస్తూ గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. 

ఇందుకు కరోనా తర్వాత తీసుకున్న టీకాలే కారణమని కొంత ప్రచారం  జరిగింది. అయితే, దీనిని డాక్టర్లు తోసిపుచ్చారు. గుండెపోటు రావడానికి కుటుంబ నేపథ్యం, జీవనశైలి కారణమని పేర్కొన్నారు.