అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: ఇంద్రకరణ్ రెడ్డి

 నిర్మల్, వెలుగు:  బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తిరిగి పార్టీని గెలిపించబోతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం స్వర్ణ వాగుపై వెంగాపేట్ వద్ద చెక్ డ్యామ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దీనికి ముందు గ్రామంలో మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ లో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. రాజకీయ స్వలాభం కోసం  కాంగ్రెస్ , బీజెపీ పార్టీలు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు అల్లోల తిరుపతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.