హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రిక్కల ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హాలియా పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఒక తడికి నీళ్లిస్తామని ప్రకటించి వారం దాటినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులు, బావులు కూడా అడుగంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోర్ల కింద సాగు చేసిన వేల ఎకరాల పంటలు సైతం సరిపడా కరెంట్ లేక ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే నీటి విడుదల చేయాలని, లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.