- 40 ఏండ్ల తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అమరుల స్తూపం
- నిర్బంధం లేకుండా మొట్టమొదటి ప్రజా నివాళి
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు
- సభ సక్సెస్తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
నిర్మల్(ఇంద్రవెల్లి), ఆదిలాబాద్టౌన్, వెలుగు : గూడాలు, తండాలన్నీ ఇంద్రవెల్లికి దండు కట్టినయ్.. ఆదివాసీల త్యాగాలకు ప్రతిరూపమైన అమరవీరుల స్తూపం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. శుక్రవారం ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు వేలాదిగా జనం తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి అటు ఆదివాసీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు క్యూ కట్టారు. సీఎం సభ సాయంత్రం ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం ఒంటిగంట వరకే సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది.
సభకు చేరుకునేముందు సీఎం రేవంత్ రెడ్డి కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం అక్కడ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. తర్వాత హెలికాప్టర్లో ఇంద్రవెల్లికి చేరుకుకొని అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. హెలిప్యాడ్ నుంచి స్తూపం వరకు రేవంత్ రెడ్డి కారులో ప్రజలకు అభివాదం చేస్తూ రాగా.. జనమంతా చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికారు.
చప్పట్లతో మార్మోగిన సభ
అక్కడి నుంచి సీఎం బహిరంగ సభ వేదికకు చేరుకొని ప్రసంగించారు. అయితే ఈసారి మాజీ సీఎం కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకొని ఘాటైన విమర్శలు చేశారు. ప్రభుత్వం కూలిపోతుందని, మళ్లీ సీఎం కేసీఆర్ అవుతాడంటూ ఓ వెధవ మాట్లాడాడని.. అలాంటి వారిని యువకులు, కార్యకర్తలు చెట్లకు కట్టేసి లాగుల్లో తొండలు వేయాలని ఫైర్ అయ్యారు. రాంజీ గోండ్, కుమ్రం భీంల త్యాగాలను వివరిస్తూ గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మట్టికి గొప్పతనం ఉందని, ఇక్కడి గాలికి పౌరుషం ఉందని
ఇక్కడి అడవుల్లో పోరాట పటిమ ఉందంటూ జిల్లా ప్రాధాన్యతను వివరించారు. అప్పటి సమైక్యవాదుల పాలనలోనే ఇంద్రవెల్లి ఘటన జరిగిందన్నారు. తప్పు జరిగినందుకు మన్నించాలని ఆదివాసీలకు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. సీఎం మాట్లాడుతున్నంత సేపు వారు చప్పట్లు కొట్టి మద్దతు పలికారు.
4 దశాబ్దాల తర్వాత అమరుల స్తూపానికి స్వేచ్ఛ
తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడమే కాకుండా అక్కడ అమరవీరుల స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమంటూ ఆదివాసి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. 40 ఏండ్ల క్రితం అప్పటి సమైక్య ఆంధ్ర పాలకుల హయాంలో అమాయక గిరిజనులను ఊచకోత కోసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ సంఘటనపై కానీ, వారిని స్మరించుకునేందుకు కానీ ఆశించిన మేర చర్యలు చేపట్టలేదు. కేవలం స్మారక స్థూపం నిర్మించినప్పటికీ నిర్బంధం లేకుండా ఆ స్తూపానికి ఆదివాసీలు నివాళులర్పించ లేని పరిస్థితులు సృష్టించారు.
దీంతో ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి విముక్తి కల్పిస్తామంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి రెండేండ్ల క్రితం ప్రకటించినట్లుగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారు. అమరవీరుల స్మారక స్తూపానికి సీఎం హోదాలో నివాళులర్పించిచారు. అమరవీరుల స్మృతి వనాన్ని కూడా నిర్మించేందుకు భూమి పూజ చేశారు. దీంతో ఇక నుంచి ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఎలాంటి నిర్బంధం ఉండబోదంటున్నారు.
గిరిజనుల హాజరుపై నజర్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరించడంలో కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ అయ్యాయి. ఇసుకేస్తే రాలనంత జనం సభకు హాజరై కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, మైనార్టీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉర్దూ మీడియం విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు మహిళలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. సభ సక్సెస్ కావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ నిండింది.
సీఎం పర్యటన ఖరారైనప్పటి నుంచి మంత్రి సీతక్క ఇంద్రవెల్లి బహిరంగ సభతోపాటు కేస్లాపూర్ కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేపట్టారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి జన సమీకరణ సంబంధించి సూచనలు జారీ చేశారు. అనుకున్న దానికన్నా రెండింతలుగా కార్యక్రమం సక్సెస్ కావడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.