బల్దియాలుగా ఇంద్రేశం, భానూర్​! సంగారెడ్డి జిల్లాలో మరో రెండు మున్సిపాలిటీలు?

 బల్దియాలుగా ఇంద్రేశం, భానూర్​! సంగారెడ్డి జిల్లాలో మరో రెండు మున్సిపాలిటీలు?
  • ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
  • పటాన్ చెరు, అమీన్​పూర్​మండలాలు కనుమరుగు 

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో రెండు మున్సిపాలిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం, భానూర్ గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయాలని ఇది వరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అప్పట్లో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. 

ప్రస్తుతం ఈ రెండు పంచాయతీలను చుట్టుపక్కల పల్లెలను కలుపుతూ మున్సిపాలిటీలుగా మార్చాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారని. ఈ ప్రతిపాదనకు సీఎం రేవంత్​రెడ్డి ఓకే చేశారని తెలుస్తోంది. దీంతో ఈమేరకు ఒకటి రెండు రోజుల్లో గెజిట్ వచ్చే చాన్స్​ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదివరకు జిల్లాలో 8 మున్సిపాలిటీలు ఉండగా, ఫిబ్రవరిలో 4 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇప్పుడు పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం, భానూర్ అప్ గ్రేడ్ ఐతే జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 14కు చేరనుంది. 

మార్పులు ఇలా... 

పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం, భానూర్ గ్రామాలను మున్సిపాలిటీలుగా అప్ గ్రేడ్ చేయాలని అధికారులు చాలాకాలం కిందటే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇంద్రేశంతో పాటు పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, రామేశ్వరం బండ, బచ్చుగూడ, ఐనోల్ గ్రామాలను విలీనం చేయాలని, భానూర్ మున్సిపాలిటీలోకి భానూర్ తోపాటు క్యాసారం, పాటి, నందిగామ, ఘనాపూర్, కర్దనూరు గ్రామాలు చేర్చాలని ప్రతిపాదించారు. ఇటీవల తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలిపిన పాటి, ఘనాపూర్, కర్దనూరు గ్రామాలను వాటికి దగ్గరాగా ఉండే భానూర్ మున్సిపాలిటీలోకి మార్చాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. పటాన్ చెరు మండలంలోని రుద్రారం, లక్డారం, తెల్లాపూర్ లో విలీనమైన పోచారం గ్రామాలను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 రెండు మండలాలు కనుమరుగు

పటాన్ చెరు, అమీన్పూర్ మండలాలు ఇక కనుమరుగు కానున్నాయి. ఈ రెండు మండలాల్లోని గ్రామాలు తెల్లాపూర్, అమీన్​పూర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. పటాన్ చెరులో మిగిలిన ఆరు గ్రామాలు కొత్తగా ఏర్పాటయ్యే ఇంద్రేశం, భానూర్ మున్సిపాలిటీలోకి, అమీన్​పూర్ మండలంలోని వడక్ పల్లి, జానకంపేట గ్రామాలు అమీన్​పూర్ మున్సిపాలిటీలో కలిపే ఛాన్స్ ఉంది. దీంతో ఈ రెండు రూరల్​ మండలాలు ఉనికిలో ఉండవు. మున్సిపాలిటీలు ఏర్పాటైన నుంచి సమస్యలు పెరిగాయంటున్న స్థానిక లీడర్లు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.