
- ఇండియా చెఫ్ డి మిషన్‌గా నారంగ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ : లండన్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఇండియా లెజెండరీ షూటర్ గగన్ నారంగ్ పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియాకు చెఫ్ డి మిషన్‌గా ఎంపికయ్యాడు. స్టార్ షట్లర్ పీవీ సింధును మెగా గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో ఇండియా మహిళా ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసినట్టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష సోమవారం ప్రకటించారు. ఇదివరకు చెఫ్ డి మిషన్‌గా లెజెండరీ బాక్సర్ మేరీకోమ్, డిప్యూటీ చెఫ్ డి మిషన్‌గా నారంగ్‌ను ఎంపిక చేశారు. కానీ, ఈ పదవికి మేరీకోమ్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో గగన్‌కు చెఫ్ డి మిషన్‌గా ప్రమోషన్ దక్కింది.
చెఫ్ -డి-మిషన్ అనేది ఒలింపిక్స్‌లో ముఖ్యమైన అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. మెగా ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్ల సంక్షేమం, వారి అవసరాలను చూసుకోవడం, ఆర్గనైజింగ్ కమిటీతో సమన్వయం చేయడం వంటి బాధ్యతలన్నీ చెఫ్ -డి-మిషన్ నిర్వర్తిస్తాడు. కాగా, ఈ నెల 26న జరిగే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌తో పాటు సింధు ఇండియా జట్టుకు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరిస్తుందని ఐఓఏ ప్రకటించింది.