
సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత. మొహెంజాదారో, హరప్పా, చాన్హుదారో, లోథాల్ మొదలైన నగరాలు భారతదేశంలో జరిగిన తొలి నగరీకరణ ఫలితాలని చరిత్రకారులు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రణాళిక, పౌర, గృహ నిర్మాణాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సింధు నాగరికతలోని నగరాలు ప్రధాన లక్షణాలు.
సింధు నగరాల్లో ఇళ్లను గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు. నగరంలోని ప్రధాన వీధులు, ఉపవీధులు, ఒకదానికొకటి క్రమ పద్ధతిలో కుడి కోణంలో ఖండించుకొని నగరాన్ని దీర్ఘచతురస్రాకార విభాగాలుగా విభజించే వ్యవస్థను గ్రిడ్ వ్యవస్థ అంటారు. గ్రిడ్ వ్యవస్థ కనిపించని ఏకైక నగరంగా బన్వాలి నిలిచింది. రహదారులన్నీ పరస్పరం 90 డిగ్రీ కోణంలో ఖండించుకుంటూ సమాన భాగాలుగా 9–34 అడుగుల వెడల్పుతో విభజించబడ్డాయి. ఈ నగరాలను ఆకాశం నుంచి చూస్తే చెస్‌బోర్డు మాదిరిగా కనిపిస్తుంది.
ప్రధాన వీధులు ఉత్తర–దక్షిణాలుగా, తూర్పు–పడమరలుగా తిన్నగా ఉండేవి. తూర్పు వీధిని రాజవీధిగా పేర్కొనేవారు. పురావస్తు శాస్త్రవేత్తలు తూర్పు, దక్షిణ వీధులు కలిసే ప్రాంతాన్ని ఆక్సఫర్డ్ సర్కస్‌గా వర్ణించారు. అన్ని వీధుల్లో ద్వీప స్తంభాలు ఉండేవి. మొహెంజాదారో, హరప్పా రెండు నగరాల నిర్మాణం ఒకే ప్రణాళిక ఆధారంగా జరిగింది. రెండింటిలోనూ పశ్చిమ దిశగా 30 నుంచి 50 అడుగుల ఎత్తున ఒక వేదికగా నిర్మితమైంది. ఈ విశాల వేదిక విస్తీర్ణం 400 X 200 గజాలు. వేదికపై పౌర నిర్మాణాలుండగా, దిగువన నగరవాసం ఉండేది.
నిర్మాణాలు
సింధు ప్రజలు తమ నిర్మాణాల్లో బట్టీల్లో కాల్చిన ఇటుకలను విస్తృతంగా ఉపయోగించారు. ఏకరూప నిర్మాణంలో ఉన్న ఇటుకలను వినియోగించారు. వీటిని బిగించడానికి మట్టి అడుసును వాడారు. వీరు ఇటుకల పేర్చివేత విధానం మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఎత్తయిన ప్రదేశంలో అంటే ఎగువ నగరంలో పాలకులు, పురోహితులు, వర్తకులు(కులీన వర్గాలు) నివసించగా, పల్లపు ప్రాంతాల్లో అంటే దిగువ నగరంలో సామాన్య ప్రజలు నివసించేవారు. విభజన కోటగోడ ద్వారా జరిగేది. అయితే, చాన్హుదారో నగరంలో కోటగోడ లేదు. కాబట్టి నగర విభజన జరగలేదు. ధోలవీర మాత్రం ఎగువ నగరం, మధ్య నగరం, దిగువ నగరం అని మూడు నగరాలుగా విభిన్నమైన ప్రణాళికలతో నిర్మించబడింది. నగరాల్లో నిర్మాణాలు రెండు రకాలుగా ఉండేవి.
అవి.. ఎ. పౌర నిర్మాణాలు బి. నివాస గృహాలు. పౌర నిర్మాణాల్లో కాల్చిన ఇటుకలను వినియోగించారు. అయితే, ధోలవీరలో మాత్రం రాతి వాడకం కనిపిస్తుంది.
పౌర నిర్మాణాలు: పడమన దిక్కున ఎత్తయిన ప్రదేశాల్లో పౌరభవనాలను నిర్మించారు. ముఖ్యమైన పౌరభవనాలుగా కోటగోడలు, ధాన్యాగారాలు, స్నాన వాటికలు ఉండేవి.
నివాస గృహాలు: తూర్పు వైపున పల్లపు ప్రాంతాల్లో నివాస భవనాలను నిర్మించారు. గృహాలను ఎత్తయిన వేదికలపై నిర్మించారు. ఈ విధంగా ఎత్తయిన వేదికలపై గృహాలను నిర్మించడానికి ప్రధాన కారణం సింధు నదీ వరదలు. ఈ గృహాలు ప్రధాన వీధుల్లో కాక ఉప వీధులకు అభిముఖంగా నిర్మించారు. ప్రతి గృహంలో సాధారణంగా బావి, స్నాన గది ఉండేది. ధనవంతుల ఇళ్లలో బావి, స్నానగదితోపాటు అదనంగా పెరడు, మరుగు దొడ్లు ఉండేవి. ఈ ఇళ్లకు కిటికీలు, ప్రవేశ మార్గం వెనుకవైపు నుంచి ఉండేవి. చరిత్రకారుల ప్రకారం దుమ్ము, ధూళిని నిరోధించడానికి ఈ ప్రణాళిక చేపట్టి ఉండవచ్చు. అయితే, లోథాల్లో మాత్రం తలుపులు, కిటికీలు రహదారి వైపు ఉండేవి. సింధు ప్రజలు ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ప్రతి ఇంటికి బయట చెత్తకుండీ ఉండేది. ఇంటిలోని చెత్తను పారవేయడానికి ఇంటి గోడకు రంధ్రం ఉండేది.
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ
సింధు నాగరికత ప్రజలు ప్రత్యేక శ్రద్ధతో మురుగు నీటిపారుదల కాలువలను నిర్మించారు. ప్రతి ఇంటి నుంచి మురుగునీరు ప్రత్యేకమైన మురుగు కాలువ ద్వారా ప్రధాన మురుగుకాలువలోకి చేరుతుంది. మ్యాన్‌హోల్స్ కూడా నిర్మించారు. కొన్ని ఇళ్లవారు టెర్రాకోటా పైపులతో నిర్మితమై గొట్టాల ద్వారా ప్రధాన మురుగు నీటి కాలువలోకి నీరు వదిలేశారు. అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే అన్ని నగరాల్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉండగా, బనవాలిలో మాత్రం ఇది కనిపించదు. స్నానాల గదులు, బావి చుట్టూ ఉండే కాలువలకు ఆంగ్ల ఆక్షరం ఎల్ ఆకారంలో ఉండే ఇటుకలను, వంకి తిరిగిన ఇటుకలను ఉపయోగించారు.
కోటగోడలు
ఈ కోట గోడల నిర్మాణం అష్టముఖ ఆకృతిలో పశ్చిమం వైపున ఉండేవి. గోడల నిర్మాణంలో ఎండబెట్టిన ఇటుకలను వాడారు. కానీ గోడలపై పూతలకు మాత్రం కాల్చిన ఇటుకలను వాడారు.
పాలకుల గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్య నిర్మాణాలు అన్నీ కోటలోనే ఎత్తయిన వేదికలపై నిర్మించారు.
ధాన్యాగారాలు
ఎ. మొహెంజాదారో ధాన్యాగారం: అతిపెద్ద ధాన్యాగారం మొహెంజాదారోలో బయటపడింది. ఈ ధాన్యాగారం
పొడవు 45.71 మీటర్లు - వెడల్పు 15.23 మీటర్లు. మొహెంజాదారో ధాన్యాగారం కోట లోపల నిర్మించారు.
బి. హరప్పా: ధాన్యాగారాన్ని కోటకు బయట నిర్మించారు. ఈ ధాన్యాగారాలు నదీతీర ప్రదేశానికి సమీపంలో ఉన్నాయి.
స్నాన వాటికలు
మొహెంజాదారోలో బయటపడిన స్నానవాటిక సింధు ప్రజల వాస్తు నిర్మాణ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచింది.
ఇది 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు ల భవనంలో గుర్తించబడింది.
మహాస్నాన వాటిక పొడవు 11.88 మీ. వెడల్పు 7.01 మీటర్లు, లోతు 2.43 మీటర్లు, మొత్తం వైశాల్యం 11,440 మీటర్లు
స్నానవాటికలోకి నీరు పంపడానికి తూర్పు పక్కన ఒక బావిని నిర్మించారు. స్నానవాటిక నుంచి నీరు వెళ్లిపోవడానికి దక్షిణం వైపున కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి స్నానవాటికకు ఇరువైపులా గదులను నిర్మించారు. స్నానవాటిక అడుగుభాగాన్ని కాల్చిన ఇటుకలు, జిప్సంతో నిర్మించారు. ఈ స్నానవాటిక బయట
3 సెం.మీ. మందంతో బిట్యుమినస్ వేయబడింది. దీనివల్ల ఈ తొట్టె నుంచి నీరు కారకుండా ఉంటుంది.