
- ఇండస్‌ఇండ్ డిపాజిటర్లు భయపడకండి
- బ్యాంక్ దగ్గర సరిపడినంత క్యాపిటల్ ఉంది: ఆర్‌బీఐ
న్యూఢిల్లీ: ఇండస్‌ఇండ్ బ్యాంక్ దగ్గర సరిపడినంత క్యాపిటల్ ఉందని కస్టమర్లకు ఆర్‌బీఐ భరోసా ఇచ్చింది. గతంలో జరిపిన ఫారెక్స్ ట్రాన్సాక్షన్లలో హెడ్జింగ్ కాస్ట్‌ను తక్కువగా అంచనా వేశామని, ఫలితంగా కిందటేడాది డిసెంబర్ నాటికి బ్యాంక్ నెట్ వర్త్ (ఆస్తులు మైనస్ అప్పులు) లో 2.35 శాతం నష్టపోయామని అంటే సుమారు రూ. 2,100 కోట్లను నష్టపోయామని ఇండస్‌ఇండ్ బ్యాంక్ సీఈఓ సుమంత్ కిందటి వారం ప్రకటించారు.
ఈ అకౌంటింగ్ లోపాలపై నెల రోజుల్లో చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ తాజాగా ఆదేశించింది. ‘బ్యాంక్ ఇప్పటికే ఎక్స్‌టర్నల్ ఆడిట్ టీమ్‌ను నియమించింది. రివ్యూ చేపడుతోంది. ఈ అకౌంటింగ్ లోపాల ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేస్తోంది’ అని ఓ స్టేట్‌మెంట్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత క్వార్టర్ (జనవరి–మార్చి) లోనే సమస్యలను పరిష్కరించాలని, స్టేక్‌హోల్డర్లకు వివరాలను బయట పెట్టాలని సూచించింది. ‘డిపాజిటర్లు భయపడాల్సిన పనిలేదు. రూమర్లపై స్పందించకండి. బ్యాంక్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా ఉంది’ అని కస్టమర్లు, ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ తెలిపింది. అకౌంటింగ్ లోపాల కారణంగా ఎంత మేర నష్టం వచ్చిందో ఆడిట్ టీమ్ లెక్కిస్తుంది. ఈ వివరాలు వచ్చే నెల ప్రారంభంలో బయటకు వస్తాయి.