- గణపురంలో ఇండస్ర్టీయల్ పార్కుకు ఏర్పాట్లు
రేగొండ, వెలుగు : సహజ వనరులకు నిలయంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టనున్నది. దీంతో స్థానిక యువతకు ఉపాధి కల్పనతో పాటు జిల్లా రూపురేఖలు మారనునన్నాయి. జిల్లాలోని గణపురం మండలం మైలారం శివారులో ఇండస్ట్రీయల్ పార్కుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలతో రెవెన్యూ యంత్రాంగం 60 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పార్క్‌ను పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా 6నెలల కాలంలో డెవలప్ చేసేవిధంగా అధికార యంత్రాంగం ప్లాన్ చేస్తుంది. పార్క్ శంకుస్థాపనకు ముహూర్తం ఈనెల 21న ఖరారు చేసినప్పటికి వర్షాల కారణంగా వాయిదా వేశారు.
పరిశ్రమలకు నిలయంగా పార్క్..
జాతీయ రహదారిని అనుకుని ఏర్పాటుకానున్న ఇండస్ర్టీయల్ పార్క్‌కు సమీపంలో టీఎస్ జెన్కో, సింగరేణి గనులు ఉండటంతో వాటి నుంచి వెలువడే యాష్, కోల్‌తో పరిశ్రమలు స్థాపనకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిల్క్ ప్రొడక్ట్, అగ్రీ ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల తయారీ, ఇంటీరియల్, పేపర్ ప్లేట్స్ తయారీలాంటి పరిశ్రమలు స్థాపించే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. యువతకు స్కిల్ డెవలప్ సెంటర్లను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
పరిశ్రమలతో అభివృద్ధి..
పరిశ్రమల స్థాపనతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్లానింగ్ చేస్తున్నాం. ఇక్కడి వనరులకు అనుగుణంగా పరిశ్రమలను నెలకొల్పి, స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యం అన్నారు. త్వరగా పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోనున్నాం.
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు