పారిశ్రామిక విత్త సంస్థలు

పారిశ్రామిక విత్త సంస్థలు

 బ్రిటీష్​ వారి కాలంలో మూలధన కొరతతో దేశ పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందలేదు. ప్రైవేట్​ రంగంలో పరిశ్రమలు స్థాపించినా తీవ్ర వెనకబాటులో ఉండేవి. దీనిపై దృష్టిసారించిన పాలకులు రెండో ప్రణాళిక కాలం నుంచి విత్త సంస్థల ఏర్పాటు ద్వారా పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చారు. 

పరిశ్రమలు తమకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవడానికి పలు మార్గాలను కలిగి ఉన్నాయి. అవి.. 1. మార్కెట్​లోకి వాటాలను జారీ చేయడం. 2. డిబెంచర్లు జారీ చేయడం, 3. కంపెనీ తనకువచ్చిన లాభాన్ని పున: పంపిణీ చేయడం, 4. స్వల్పకాలిక రుణ అవసరాలకు వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, 5. ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, 6. పారిశ్రామిక విత్త సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణాలు స్వీకరించడం. 

రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా సూచనల మేరకు 1948లో ఇండస్ట్రియల్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఐఎఫ్ సీఐ) ఏర్పడింది. ఈ సంస్థ మధ్య, దీర్ఘకాల పారిశ్రామిక విత్తాన్ని ఇస్తుంది. ఐఎఫ్​సీఐ ఏర్పాటు తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా విత్త సంస్థలు ఏర్పడ్డాయి. 1940లోనే తమిళనాడు పెట్టుబడి కార్పొరేషన్​ ఏర్పడింది. 1950 దశకంలో రాష్ట్రస్థాయి విత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఇవి కూడా ఐఎఫ్​సీఐ లాగానే పారిశ్రామిక అంతరాలు తగ్గించే విత్త సంస్థలుగా, ఐఎఫ్​సీఐకి అనుబంధంగా కార్యకలాపాలు చేపట్టాయి. ఈ రెండు సంస్థలు దీర్ఘకాల పారిశ్రామిక మూలధన కొరతను తీర్చలేకపోయాయి. 

విత్త అవసరాలతోపాటు పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు 1954లో నేషనల్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (ఎన్​ఐడీసీ)ను  ఏర్పాటు చేశారు. తర్వాత ఇది కన్సల్టెన్సీ సంస్థగా మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంక్​ స్పాన్సర్​షిప్​తో 1955లో ఇండస్ట్రియల్​ క్రెడిట్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(ఐసీఐసీఐ) ఏర్పడింది. ఈ సంస్థ యాజమాన్యం మాత్రం ప్రైవేట్​ రంగానిదే. 

ప్రారంభంలో రుణాలు ఇచ్చేది. ప్రపంచ బ్యాంక్​ నుంచి రుణాలు తీసుకొని ప్రైవేట్​రంగ పరిశ్రమలకు ప్రపంచ బ్యాంక్​ సహాయం అందించే మార్గంగా మారింది. 2002లో ఐసీఐసీ బ్యాంకు విలీనం కావడంతో అభివృద్ధి విత్త సంస్థగా కాకుండా యూనివర్సల్​ బ్యాంకుగా మారింది. 1964లో పారిశ్రామిక విత్తంలో శిఖరాగ్ర సంస్థగా ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంకును ఏర్పాటు చేశారు. మొదట్లో అనుబంధ సంస్థగా ఉన్నా 1976 నుంచి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తున్నది. ఇది విత్త ఏజెన్సీగానే కాకుండా పారిశ్రామిక విత్త సంస్థల కార్యకలాపాలను అనుసంధానిస్తున్నది. 2004 నుంచి ఇది బ్యాంకుగా మారింది. 

ఐఎఫ్​సీఐ

ఆర్​బీఐ ఎంక్వయిరీ కమిటీ సిఫారసుల ఆధారంగా 1948లో మొదటి అఖిల భారత అభివృద్ధి విత్త సంస్థ ఐఎఫ్​సీఐ ఏర్పడింది. ఇది దేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలకు మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఇస్తుంది. పారిశ్రామిక విత్త సంస్థలకు పోటీగా కాకుండా అంతరాలు భర్తీ చేసేదిగా ఉంటుంది. 1993లో ఇది కంపెనీగా మారడంతో లిమిటెడ్​ హోదా పొందింది. 

అందుకే దీనిని ఐఎఫ్​సీఐ లిమిటెడ్​గా పిలుస్తారు. లిమిటెడ్​ హోదా పొందిన తర్వాత ఇందులో సాధారణ ప్రజలు కూడా వాటాదారులుగా అనుమతిస్తాయి. 25 సంవత్సరాల కాల వ్యవధిలో చెల్లించేలా దేశ, విదేశీ కరెన్సీలో రుణాలు ఇవ్వడం, షేర్లు, డిబెంచర్లకు పూచీకత్తుగా వ్యవహరించడం, పారిశ్రామిక సంస్థల రుణాలకు గ్యారంటీ ఇవ్వడం తదితర విధులు చేపడుతుంది. దీనికి కూడా నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి.

ఐసీఐసీఐ

ప్రైవేట్​ రంగంలో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రుణాలు అందించేందుకు 1955లో ఏర్పడిన రెండో అఖిల భారత అభివృద్ధి విత్త సంస్థ. ఇది దేశ, విదేశీ కరెన్సీల్లో రుణాలు ఇస్తుంది. 1973 నుంచి ఐసీఐసీఐ అంతర్జాతీయ మూలధన మార్కెట్​లోకి ప్రవేశించింది. 2002లో ఐసీఐసీఐ లిమిటెడ్, దాని రెండు అనుబంధ సంస్థలు విలీనం కావడం వల్ల ఐసీఐసీఐ బ్యాంక్​గా ఏర్పడింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి విత్త సంస్థ కాదు. ఐసీఐసీ బ్యాంక్​ భారత్​లో తొలి యూనివర్సల్​ బ్యాంక్​.

ఐఐబీఐఎల్​

1971లో స్థాపించిన ఇండస్ట్రియల్​ రీ కన్​స్ట్రక్షన్​ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(ఖాయిలాపడ్డ పరిశ్రమలకు రుణాలు అందించేందుకు) పేరుమార్చి 1985లో స్వతంత్ర ప్రతిపత్తి కల్పించి ఐఆర్​బీఐగా ఏర్పాటు చేశారు. 1997లో ఐఆర్​బీఐని ఐఐబీఐఎల్​గా పునర్​ నిర్మించారు. ఇది కంపెనీ చట్టం–1956 కింద నమోదైంది. ఇది పూర్తిగా భారత ప్రభుత్వ నియంత్రణలోని సంస్థ. దీని కేంద్రం కలకత్తాలో ఉంది. 

ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

ఆర్​బీఐకి అనుబంధంగా 1964లో ఏర్పడింది. 1976లో స్వతంత్ర ప్రతిపత్తిని పొందింది. పారిశ్రామిక విత్తంలో ఇది శిఖరాగ్ర సంస్థ. ఇతర పారిశ్రామిక విత్త సంస్థలను ఇది సమన్వయం చేస్తుంది. ఇది పరిశ్రమకు ప్రత్యక్ష రుణాలు(షేర్లు, డిబెంచర్లు కొనుగోలు ద్వారా), పరోక్ష దీర్ఘకాలిక సహాయాన్ని (స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​, స్మాల్​ ​ ఇండస్ట్రీస్​ ​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​, వాణిజ్య బ్యాంకులకు రుణాలివ్వడం) అందిస్తున్నది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సాయం అందిస్తుంది. 2004లో ఐడీబీఐ లిమిటెడ్​గా మారింది.  ప్రస్తుతం యూనివర్సల్​ బ్యాంక్​గా ఉంది.  

స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​

ఐఎఫ్​సీఐ భారీ మధ్యతరహా పరిశ్రమలకు విత్త సహాయం అందిస్తుంది. అందుకే చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఎస్ఎఫ్​సీ ఏర్పడింది. ఎస్​ఎఫ్​సీ యాక్ట్​–1951 ప్రకారం భారత్​లో మొదటి ఎస్​ఎఫ్​సీ పంజాబ్​లో 1953లో ఏర్పడింది. 1956లో ఏపీఎస్​ఎఫ్​సీ ఏర్పాటైంది. చిన్న, మధ్యతరహా సంస్థలకు దీర్ఘకాల రుణాలను ఇస్తుంది. స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​1960లో ఏపీ, బిహార్​ల్లో స్థాపించారు. ప్రస్తుతం 28 ఎస్​ఐడీసీలు ఉన్నాయి.

స్మాల్​ ఇండస్ట్రీస్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా

1988–89 బడ్జెట్​లో ప్రకటనకు అనుగుణంగా ఎస్​ఐడీబీ యాక్ట్​ – 1989 కింద ఐడీబీఐకు అనుబంధంగా 1990లో ఎస్​ఐడీబీఐ ఏర్పడింది. చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే విత్త సంస్థలను ఇది సమన్వయం చేస్తుంది. దీని ప్రధాన కేంద్రం లక్నోలో ఉంది. ఐడీబీఐకి అనుబంధంగా ఉన్న ఎస్​ఐడీబీఐను 1998–99 బడ్జెట్​ ద్వారా వేరు చేశారు. ఎస్​ఎఫ్​సీలో ఐడీబీఐ వాటా ఎస్​ఐడీబీఐకి బదిలీ అయింది. ఒకప్పుడు ఐడీబీఐకి ఉన్న చిన్న పరిశ్రమలను పర్యవేక్షించే విధి ఎస్​ఐడీబీఐకి బదిలీ అయింది. 

చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చే స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ (ఎస్​ఎఫ్​సీ), వాణిజ్య బ్యాంకులు, స్టేట్​ ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ వంటి సంస్థలకు ఎస్​ఐడీబీఐ విత్త సహాయాన్ని అందిస్తుంది. ఇది సింగిల్​ విండో సర్వీసు కింద దేశ, విదేశీ కరెన్సీల్లో రుణాలు అందిస్తుంది. ఆధునికీకరణ, ఉపాధి కల్పనా పరిశ్రమలను ప్రోత్సహించడం, చిన్న పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించడం తదితర చర్యలు చేపడుతుంది. రుణాల రీఫైనాన్స్​, బిల్లులు రీడిస్కౌంట్ చేయడం, ఫ్యాక్టరింగ్​ లీజింగ్​  సేవలందించడం తదితర కార్యకలాపాలు ఎస్​ఐడీబీఐ చేపడుతుంది.