జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ ​సిటీ

  • 2,361 కోట్ల వ్యయం.. 1.74 లక్షల మందికి ఉపాధి
  • ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో కూడా స్మార్ట్​ సిటీ కారిడార్​
  • మొత్తం 10 రాష్ట్రాల్లో ఏర్పాటుకు కేంద్ర కేబినెట్​ నిర్ణయం
  • రూ.6,456 కోట్లతో మూడు కొత్త రైల్వే ప్రాజెక్ట్స్​
  • ఈశాన్య రాష్ట్రాల్లో రూ.4 వేల కోట్లతో హైడ్రో పవర్​ ప్రాజెక్టులు
  • 234 నగరాలకు ప్రైవేట్​ ఎఫ్ఎం రేడియో చానల్స్​
  • తెలంగాణలోని 10 పట్టణాల్లో 31 ఎఫ్ఎం చానళ్లు

న్యూఢిల్లీ, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జహీరాబాద్ టౌన్ కు ఈశాన్యంలో 9  కిలోమీటర్ల దూరంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఫస్ట్ ఫేజ్​లో 3,245 ఎకరాల్లో మొత్తం రూ.2,361 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ఇండస్ట్రియల్​ స్మార్ట్​ కారిడార్​లో లక్షా 74 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొన్నది. అలాగే, దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. 

Also Read:-నేను రేవంత్​ రెడ్డిని ఎవ్వరినీ వదల..కేసీఆర్ తో నాకు పోలికేంటి

ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మెషినరీ, మెటల్స్, నాన్-మెటాలిక్, రవాణా తదితర రంగాలకు చెందిన పరిశ్రమలు రానున్నాయి.  బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన కేంద్ర కేబినెట్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్​మెంట్​ ప్రోగ్రాం (ఎన్ఐసీడీపీ) కింద దేశవ్యాప్తంగా 12  ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 28,602 కోట్లతో ఈ 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  ఇందులో  భాగంగా జహీరాబాద్​తోపాటు ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో వీటిని​ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

పారిశ్రామిక అభివృద్ధికి మరింత ముందడుగు 

హైదరాబాద్–-నాగ్‌‌‌‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌‌‌‌లో భాగంగా.. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగం మండలాల్లోని 17  గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణం జరగనున్నది.  మొత్తం రెండు దశల్లో దాదాపు 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మార్ట్​సిటీ కారిడార్​ విస్తరించనుంది. ఎన్ఐసీడీఐటీ ఫ్రేమ్‌‌‌‌వర్క్‌‌‌‌లో భాగంగా.. 3,245 ఎకరాల్లో మొదటి దశలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.. పుణె–-మచిలీపట్నం జాతీయ రహదారికి (ఎన్ హెచ్–65) 2 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. దీంతోపాటు  నిజాంపేట్–-బీదర్ రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్–-16), జహీరాబాద్-–బీదర్ రాష్ట్ర రహదారి (ఎస్ హెచ్-–14) సమీపంలోనే ఉన్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్‌‌‌‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజినల్ రింగ్‌‌‌‌ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనున్నది. కీలకమైన గ్యాస్ ట్యాప్‌‌‌‌ ఆఫ్ పాయింట్ (పెట్రోలియం ఉత్పత్తుల మెయిన్​ పైప్‌‌‌‌లైన్) కూడా జహీరాబాద్-–బీదర్ మధ్యలో.. ప్రతిపాదిత ప్రాజెక్టుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండనుంది. . దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ, పర్యావరణ శాఖ ఇప్పటికే మంజూరు చేసింది. కాగా, తెలంగాణ, -కర్నాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్​​సిటీతో రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి మరింత వేగం కానుందని కేంద్రం వెల్లడించింది. 

తెలంగాణలో  ప్రైవేట్ ఎఫ్ఎం చానల్స్​

ప్రైవేట్ ఎఫ్ఎం ఫేజ్​3 పాలసీలో భాగంగా తెలంగాణలోని 10 పట్టణాల్లో 31 ప్రైవేట్ ఎఫ్ఎం చానళ్ల ఏర్పాటుకు కేబినెట్​ఆమోదం తెలిపింది. రూ.784.87 కోట్ల ఎస్టిమేటెడ్ రిజర్వ్డ్ ప్రైజ్ తో ఇప్పటి వరకు ఎఫ్ఎం కవర్ కాని 234 కొత్త నగరాల్లో 730 చానల్స్​కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మాతృభాషలో స్థానిక కంటెంట్‌‌‌‌ను పెంచడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. కాగా, తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్​నగర్, మంచిర్యాల, నల్గొండ, రామగుండం, సూర్యాపేట్​లో 3 చానల్స్ చొప్పున, నిజామాబాద్​లో 4 కొత్త చానల్స్ వేలం కోసం ఆమోదించబడ్డాయి. అలాగే, ఏపీలోని 22 సిటీల్లో 68 ఎఫ్ఎం చానల్స్​ రానున్నాయి. 

ప్రధానికి కిషన్​రెడ్డి కృతజ్ఞతలు

జహీరాబాద్​లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల(దాదాపు రూ.170 లక్షల కోట్లు) ఎగుమతులు చేసే లక్ష్యంతోపాటు.. ఆత్మ నిర్భర భారత్ నిర్మాణం దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు.  ప్రధాని మోదీ, పరిశ్రమల మంత్రి గోయల్​కు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.