తాతకు మనవడి మరణ శాసనం.. వందల కోట్ల ఆస్తి ఉంది.. 73 సార్లు పొడిచి మనవడే చంపేశాడు..!

తాతకు మనవడి మరణ శాసనం.. వందల కోట్ల ఆస్తి ఉంది.. 73 సార్లు పొడిచి మనవడే చంపేశాడు..!

హైదరాబాద్: పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్‌ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు (86)  దారుణ హత్యకు గురయ్యాడు. సొంత మనవడే ఆస్తి కోసం ఆయనను అతి కిరాతకంగా హత్య చేశాడు. 73 సార్లు జనార్దనరావు ను మనవడు కీర్తి తేజ కత్తితో పొడిచి చంపాడు. మిగతా మనవళ్లను చూసినట్టు తనను చూడలేదని ఫీలై కసితో హత్య చేసినట్లు తేలింది. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి జనార్దనరావు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని మరో మనమడు కీర్తి తేజ డిమాండ్ చేశాడు.

అమెరికాలో ఉండి ఇటీవలే కీర్తి తేజ హైదరాబాద్ వచ్చాడు. కీర్తి తేజ చెడు వ్యసనాలను చూసి డైరెక్టర్ పోస్టు ఇచ్చేందుకు జనార్దనరావు నిరాకరించాడు. డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకపోవడంతో 73 సార్లు కసితో కీర్తితేజ ఆయనను పొడిచిపొడిచి చంపాడు. జనార్దనరావును చంపుతుంటే అడ్డం వచ్చిన తల్లిపై 12 సార్లు కీర్తి తేజ పొడిచాడు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. తల్లి, తాత అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. అప్పటికే జనార్దనరావు చనిపోగా తీవ్ర గాయాలతో  కీర్తి తేజ తల్లి కొట్టుమిట్టాడుతూ రక్తపు మడుగులో కనిపించింది. కీర్తి తేజ తల్లిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసి  కీర్తి తేజ ఏలూరు పారిపోయాడు. కీర్తి తేజను ఏలూరులో పోలీసులు అరెస్టు చేశారు.

టీటీడీకి గతంలో రూ.40 కోట్లకు పైగా జనార్దనరావు విరాళాలు ఇచ్చారు. హైడ్రాలిక్ పంపులు, మోటార్లు, వాల్వ్‌లు, కస్టమ్ బిల్ట్ పవర్ ప్యాక్‌ల తయారీ వ్యాపారంలో ప్రముఖ కంపెనీగా కొనసాగుతున్న వెల్జాన్ (VELJAN Hydrair Private, Ltd) ప్రస్తుత చైర్మన్గా జనార్దనరావు ఉన్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న జనార్దనరావు ఇలా దారుణ హత్యకు గురవుతారని ఆయన కుటుంబ సభ్యులు కలలో కూడా ఊహించలేదు. అది కూడా సొంత మనమడి చేతిలో. చంద్రశేఖర్ మనమడు కీర్తి తేజ గత కొంతకాలంగా డ్రగ్స్కు అలవాటయ్యాడు. 

అమెరికాలో విపరీతమైన డ్రగ్స్ కు అలవాటు పడి చెడిపోతున్నాడని అతని తల్లి సరోజ ఇటీవల కీర్తితేజను హైదరాబాద్ తీసుకొచ్చింది. కొన్నాళ్లపాటు డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ కూడా ఇప్పించింది. ఇటీవల కాలంలో నాలుగు కోట్ల రూపాయల షేర్స్ని కీర్తి తేజకు జనార్దనరావు బదిలీ చేశాడు. అయితే తనకు కంపెనీలో వాటాలతో పాటు డైరెక్టర్ పోస్ట్ కూడా కావాలని కీర్తి తేజ పట్టుబట్టాడు.

చెడు అలవాట్లకు బానిసైనా కీర్తి తేజకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చేది లేదని జనార్దనరావు తేల్చి చెప్పాడు. మరో మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. తనను అందరితో సమానంగా చూడడం లేదని కసితో జనార్దనరావును కీర్తి తేజ కిరాతకంగా హతమార్చాడు. చైర్లో కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న జనార్దనరావుపై కీర్తి తేజ ఒక్కసారి దాడి చేశాడు. 73 సార్లు జనార్దనరావును కీర్తి తేజ పొడిచి చంపాడంటే ఎంత క్రూరంగా ఈ ఘటన జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఉన్న చంద్రశేఖర జనార్థన్ రావు ఇంట్లో ఈ ఘటన జరిగింది. ఆయన స్వస్థలం ఏపీలోని ఏలూరు.