- ఎల్కతుర్తి సమీపంలోని వాగులో కలుస్తున్న గ్రానైట్ కంపెనీ కెమికల్స్
- మడికొండ వద్ద కెనాల్ లో కలుస్తున్న పారాబాయిల్డ్ మిల్లు నీళ్లు
హనుమకొండ, వెలుగు: కాలుష్యాన్ని కంట్రోల్ చేయాల్సిన పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) ఆఫీసర్లే డ్యూటీలో కంట్రోల్ తప్పుతున్నారు. కాలుష్య కారక కంపెనీలు, ఇండస్ట్రీల్లో నిత్యం తనిఖీలు చేయాల్సిన ఆఫీసర్లు.. లైట్ తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రూల్స్ బ్రేక్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రైస్ మిల్లులు, గ్రానైట్ కట్టింగ్, పాలిషింగ్ఇండస్ట్రీలు, స్టోన్ క్రషర్స్, తోళ్ల పరిశ్రమలు, వివిధ ప్లాస్టిక్ కంపెనీలు రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నా.. కన్నెత్తి చూడడం లేదు.
రూల్స్ అన్నీ బ్రేక్..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 255 రైస్ మిల్లులున్నాయి. ఇందులో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 114, హనుమకొండ జిల్లాలో 58, జనగామలో 38, జయశంకర్ భూపాలపల్లిలో 20, మహబూబాబాద్ జిల్లాలో 25 మిల్లులుండగా.. ఇందులో చాలావరకు రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. మిల్లులో ఉనక గాలిలోనే కలుస్తోంది. పారాబాయిల్డ్ మిల్లుల నుంచి వచ్చే నీటిని బహిరంగ ప్రదేశాలు, పక్కనే ఉన్న కెనాల్స్ లోకి వదులుతున్నారు. దీంతో చుట్టుపక్కల పరిసరాలన్నీ కలుషితం అవుతున్నాయి. దుర్వాసనతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయినా పీసీబీ అధికారులు అటువైపు తొంగి చూడడం లేదు.
గ్రానైట్ కెమికల్స్ బయటికే..
వరంగల్ సిటీ చుట్టుపక్కల దాదాపు 58 స్టోన్కట్టింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీలు ఉండగా.. చాలావరకు పీసీబీ రూల్స్ పాటించడం లేదు. పాలిషింగ్కోసం ఎపోక్సిరైసిన్తో పాటు ఇతర ప్రమాదకర కెమికిల్స్ ఇష్టారీతిన వాడి, ఆ కలుషిత నీటిని బయటకు వదులుతున్నా చర్యలు లేవు. ఉదాహరణకు.. ఎల్కతుర్తిలో సమీపంలోని ఇండస్ట్రీల నుంచి వస్తున్న కెమికల్ వాటర్ .. చుట్టుపక్కల పంటలను నాశనం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయా కంపెనీల ఓనర్ల దృష్టికి తీసుకెళ్తే.. కెమికల్ వాటర్ వాగులో కలవకుండా చర్యలు తీసుకుంటామని చెబుతూ కాలంవెల్లదీస్తున్నారు. ఇక ఎల్కతుర్తి, ధర్మసాగర్, వేలేరు, హసన్‌పర్తి, తదితర మండలాల్లోని స్టోన్ క్రషర్లు ఇష్టారీతిన పేలుళ్లకు పాల్పడుతున్నాయి. వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో చుట్టుపక్కల ప్రజలు రోగాల బారినపడుతున్నారు.
ప్లాస్టిక్ ఇండస్ట్రీలు కూడా..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ సింగిల్ యూజ్ప్లాస్టిక్ను తయారు చేసే కంపెనీలు వరంగల్ నగరంలోనే పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇందులో చాలా కంపెనీలు పర్మిషన్లు కూడా తీసుకోలేదు. ఇల్లీగల్ గా ప్లాస్టిక్‌ను తయారు చేస్తున్నాయి. అయినా ఇంతవరకు పీసీబీ ఆఫీసర్లు యాక్షన్ తీసుకోలేదు. నగరంలో తోళ్ల శుద్ధి పరిశ్రమలు కూడా రహస్యంగా అనుమతులు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఒక్క తనిఖీ కనిపించట్లే..
కంపెనీల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నా పీసీబీ ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారు. ఫీల్డ్‌విజిట్ చేయాల్సిన ఆఫీసర్లు మామూళ్లకు అలవాటుపడి ఇండస్ట్రీల వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లైంట్ చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేపట్టి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. దీనిపై పీసీబీ ఈఈ సునీతను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆమె అందుబాటులో లేరని అక్కడి సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, కాలుష్య కారక కంపెనీలపై దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
రోగాలు వస్తున్నా తనిఖీలు చేస్తలేరు
గ్రానైట్ కంపెనీల నుంచి వచ్చే కెమికల్స్ కారణంగా చర్మ వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి. పశువులు కూడా చనిపోతున్నాయి. కంపెనీల ఓనర్ల దృష్టికి తీసుకెళ్తే వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. సమస్య స్థానిక లీడర్లు, ఆఫీసర్ల దృష్టిలో ఉన్నా ఇంతవరకు ఎవరూ పట్టించుకోవడం లేదు. పీసీబీ ఆఫీసర్లు ఇంతవరకు తనిఖీ చేసిన దాఖలాలు లేవు.- గూడెపు సమ్మయ్య, ఎల్కతుర్తి