ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ సొంతం చేసుకున్న భారత మహిళా జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. శనివారం వాంఖడే వేదికగా జరిగిన రెండో వన్డేలో 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన 258 పరుగులు చేయగా.. ఛేదనలో భారత మహిళలు 255 పరుగులకే పరిమతమయ్యారు.
దిగ్గజాల సరసన దీప్తి శర్మ
డ్రై పిచ్‌పై దీప్తి శర్మ స్పిన్‌తో ఆసీస్‌ను కట్టడి చేసినా.. ఫీల్డర్లు ఏడు క్యాచ్‌లుజారవిడచడంతో భారీ స్కోరుకు కారణమయ్యారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లు తీసిన దీప్తి.. ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్‌లను ఔట్ చేసింది. ఈ ప్రదర్శనతో దీప్తి శర్మ మహిళల వన్డేల్లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే, ఓవరాల్‌గా భారత క్రికెటర్లలో రవిశాస్త్రి, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మురళీ కార్తీక్, అజిత్ అగార్కర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ తర్వాత ఎనిమిదో భారతీయురాలుగా తన పేరు లిఖించుకుంది.