INDW vs AUSW: కొత్త ఏడాది పాత కథే.. ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

INDW vs AUSW: కొత్త ఏడాది పాత కథే.. ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 190 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు 338 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత మహిళలు 148 పరుగులకే కుప్పకూలారు. ఈ విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు  చేసింది. ఓపెనర్‌ ఫోబె లిచ్‌ఫీల్డ్‌ (119; 125 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్‌) సెంచరీ చేయగా.. కెప్టెన్‌ అలిస్సా హీలి (82; 85 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేసింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 189 పరుగులు జోడించారు. వీరిద్దరి దూకుడుకు ఒకానొక సమయంలో ఆసీస్ 350 పైచిలుకు పరుగులు చేస్తారనుకున్నారు. అయితే, ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు త్వరగా పెవిలియన్ చేరడంతో 338 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.

అనంతరం భారీ ఛేదనలో భారత మహిళలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. 32.4 ఓవర్లలో 148 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. 29 పరుగులు చేసిన స్మ్రితి మందాన టాప్ స్కోరర్. ఆసీస్ బౌలర్లలో జార్జియా వేర్‌హామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అలనా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్, మేఘన్ స్కట్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.