చరిత్రలో తొలిసారి: బంగ్లా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

చరిత్రలో తొలిసారి: బంగ్లా చేతిలో టీమిండియా ఘోర ఓటమి

టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన భార‌త మ‌హిళ‌ల‌ జ‌ట్టు.. వ‌న్డే సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌‌తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల(డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతి ప్రకారం) తేడాతో ఓటమి పాలైంది. వన్డే ఫార్మాట్‌లో భారత జట్టుపై బంగ్లా మహిళల జట్టుకు ఇది తొలి విజయం కావటం గమనార్హం. 

టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. ఆట ప్రారంభమైన కాసేపటికే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం ఆట తిరిగి ప్రారంభం కాగా, అంపైర్లు మ్యాచ్‌ను 44 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 43 ఓవ‌ర్ల‌లో 10 వికెట్ల న‌ష్టానికి 152 ప‌రుగులు చేసింది. స్వల్ప లక్ష్యమే కదా! భారత బ్యాటర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధిస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితం మరోలా వచ్చింది. 

153 పరుగుల స్వల్ప చేధనకు దిగిన భారత జట్టు.. 35.5 ఓవర్లలోనే 113 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో జోరు చూపించిన భారత అమ్మాయిలు.. బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేశారు. మరికొద్ది సేపటిలో ఢాకా స్టేడియం నీట మునుగుతుందన్నట్లుగా  ఒకరివెంట మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్ మరుఫా అక్తర్ (4/29), రెబయా ఖాన్ (3/30) భారత్‌ పతనంలో కీలక పాత్ర పోషించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఇక ఈ ఇరు జట్ల రెండో వన్డే మ్యాచ్ జులై 19న ఢాకా వేదికగా జరగనుంది.