గెలవడానికి ఐదేళ్లు పట్టింది: టీమిండియాపై బంగ్లాదేశ్ ఘన విజయం

గెలవడానికి ఐదేళ్లు పట్టింది: టీమిండియాపై బంగ్లాదేశ్ ఘన విజయం

తొలి రెండు టీ20ల్లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత మహిళల జట్టు.. మూడో టీ20లో మాత్రం తేలిపోయింది. ఇరు జట్ల మధ్య గురువారం జరిగిన ఆఖరి టీ20లో బంగ్లా జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. భారత జట్టు నిర్ధేశించిన 103 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా..10 బంతులు మిగిలివుండగానే ఛేదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(40) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. స్మృతి మందాన(1) సింగిల్ డిజిట్ కే వెనుదిరగగా, షఫాలీ వర్మ(11), జెమీమా రోడ్రిగ్స్(28), యస్తిక భాటియా(11), దీప్తి శర్మ(4).. ఇలా ఒకరివెంట మరొకరు స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో టీమిండియా 102 పరుగులే పరిమితమైంది.

అనంతరం 103 పరుగుల లక్ష్య చేధనకు దిగిన బంగ్లా మహిళా బ్యాటర్లు నిలకడగా ఆడుతూ టార్గెట్ ఛేదించారు. ఆ జట్టు ఓపెనర్ షమీమా సుల్తానా(42) భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించింది. భారత బౌలర్లలో మిన్ను మోని, దేవికా వైద్య చెరో రెండు వికెట్లు తీసుకోగా.. జెమీమా రోడ్రిగ్స్ ఒక వికెట్ తీసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 16న, ఆదివారం జరగనుంది.

చివరిసారిగా బంగ్లా మహిళల జట్టు.. టీమిండియాపై 2018లో గెలుపొందింది. ఆసియా కప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య  జరిగిన ఆ మ్యాచులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.