INDW vs SAW: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి ఓవర్‌లో గట్టెక్కిన భారత మహిళలు

INDW vs SAW: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి ఓవర్‌లో గట్టెక్కిన భారత మహిళలు

ఎదుట 325 పరుగుల భారీ లక్ష్యం.. విదేశీ గడ్డపై మ్యాచ్.. ప్రత్యర్థి జట్టులో నాణ్యమైన బౌలర్లు.. అందునా, తొలి వన్డేలో 122 పరుగులకే అలౌట్.. కానీ, ఇవేవి సఫారీ మహిళలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. సొంతగడ్డపై భారత మహిళలను ఓడించనంత పనిచేశారు. విజయపు అంచల దాకా వచ్చి చివరి మెట్టుపై బోల్తా పడ్డారు. 

తొలుత భారత మహిళా జట్టు 325 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ జట్టు 321 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సౌతాఫ్రికా విజయానికి చివరి 4 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో భారత మహిళలు అద్భుతం చేశారు. ఆఖరి ఓవర్ వేసిన పూజా వస్త్రాకర్.. మూడు, నాలుగు బంతులకు వరుస వికెట్లు తీసి మ్యాచ్ భారత్ వశం చేసింది.

దక్షణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (135 నాటౌట్; 135 బంతుల్లో 12 ఫోర్లు 3  సిక్స్‌లు), మారిజానే కాప్ (114; 94 బంతుల్లో 11 ఫోర్లు, 3  సిక్స్‌లు) శతకాలు బాదారు. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టుకు వీరిద్దరూ ప్రాణం పోశారు. ఆదిలో శాంతంగా ఆడినా.. క్రీజులో కుదురుకున్నాక భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. 

మందాన, హర్మన్ ప్రీత్ సెంచరీలు

అంతకుముందు భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(136), హర్మన్‌ప్రీత్ కౌర్(103 నాటౌట్) ఇద్దరు సెంచరీలు చేశారు. షఫాలీ వర్మ(20), దయాళన్ హేమలత(24), రిచా ఘోష్ (25 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో భారత మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. 

సిరీస్ మనదే.. 

ఈ విజయంతో హర్మన్ సేన.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరొకటి మిగిలివుండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఆదివారం(జూన్ 23) జరగనుంది.