INDW vs SAW: హ్యాట్రిక్ సెంచరీ చేజార్చుకున్న మంధాన.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

INDW vs SAW: హ్యాట్రిక్ సెంచరీ చేజార్చుకున్న మంధాన.. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ను భారత మహిళా జట్టు 3-0తో చేజిక్కించుకుంది. బెంగుళూరు వేదికగా ఆదివారం(జూన్ 23) జరిగిన ఆఖరి వన్డేలో హర్మన్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని భారత జట్టు 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించారు.

రాణించిన మంధాన

తొలి రెండు వన్డేల్లో శతకాలు బాదిన వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన(90; 83 బంతుల్లో 11 ఫోర్లు) ఆఖరి మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకుంది. దీంతో హ్యాట్రిక్ సెంచరీల రికార్డు చేజార్చుకుంది. మ్లాబా వేసిన 31 ఓవర్‌లో 90 పరుగుల వద్ద వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42; 48 బంతుల్లో 2 ఫోర్లు), షఫాలీ వర్మ (25), ప్రియా పునియా (28), జెమీమా రోడ్రిగ్స్‌ (19 నాటౌట్) రాణించారు.

102/1 నుంచి 215/8 

అంతకుముందు దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కెప్టెన్ వోల్వార్ట్ (61; 57 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. తజ్మిన్ బ్రిట్స్ (38; 66 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో 250 పైచిలుకు పరుగులు చేసేలా కనిపించినా.. వీరు ఔటయ్యాక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఒక్కసారిగా గాడితప్పింది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో  సఫారి జట్టు కోలుకోలేకపోయింది. చివరలో నాడిన్ డిక్లెర్క్ (26), మైకే డి రిడర్ (26 నాటౌట్) ఆదుకోవడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగారు.