మొన్న బెంగళూరు, ఇప్పుడు అస్సాం... ఇండియాలో పెరిగిపోతున్న HMPV వైరస్ కేసులు..

ఇండియాలో HMPV వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.. బెంగళూరులో ఒకే రోజు రెండు కేసులు నమోదు కాగా.. తాజాగా అస్సాంలో మరో HMPV వైరస్ కేసు నమోదయ్యింది. శనివారం ( జనవరి 11, 2025 ) 10 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకినట్లు గుర్తించామని అస్సాం వైద్యాధికారులు వెల్లడించారు. ఈ సీజన్లో ఇదే మొదటి కేసు అని తెలిపారు అధికారులు. చిన్నారి దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని.. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు అధికారులు.

నాలుగు రోజుల క్రితం జలుబు సంబంధిత లక్షణాలతో చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. రొటీన్ ప్రాక్టీస్‌గా ఇన్‌ఫ్లుఎంజా మరియు ఫ్లూ సంబంధిత కేసుల పరీక్షల కోసం నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు పంపుతామని.. ఈ క్రమంలో చిన్నారి శాంపిల్స్ ను పరీక్షకు పంపగా శుక్రవారం ( జనవరి 10, 2025 ) నిర్దారణ అయ్యిందని తెలిపారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని... ఇది సాధారణ వైరస్ అని, ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు అధికారులు. HMPV వైరస్ అనేది అన్ని వయసులవారిలో, ముఖ్యంగా శీతాకాలం, వసంత ఋతువు ప్రారంభంలో ఇన్‌ఫెక్షన్‌లను కలిగించే అనేక శ్వాసకోశ వైరస్‌లలో ఒకటి అని తెలిపారు అధికారులు.