జగిత్యాల, వెలుగు: ఏఎన్ఎం నిర్లక్ష్యం కారణంగా టీకా వికటించి తమ పాప ఇన్ఫెక్షన్ కు గురై అవస్థ పడుతోందని జగిత్యాల పట్టణానికి చెందిన సురేశ్, జల దంపతులు వాపోయారు. నెల రోజుల కింద తమ మూడు నెలల పాపకు 15 వార్డు లోని అంగన్ వాడీ సెంటర్ లో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో టీకా వేయించగా, ఏఎన్ఎం మరియమ్మ సెల్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా టీకా వేసిందని ఆరోపించారు.
తీవ్ర జ్వరం రావడంతో పాటు టీకా వేసిన ప్రాంతం గడ్డగా మారి చీము రావడం మొదలైందని తల్లి వాపోయింది. సదరు ఏఎన్ఎంను నిలదీయగా పొరపాటు జరిగిందని, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో 10 రోజుల కింద సర్జరీ చేయించామని, అయినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గడం లేదని, రోజురోజుకు శిశువు ఆరోగ్యం క్షీణిస్తుందని వాపోయారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో సమియోద్దీన్ ను వివరణ కోరగా, బాధితుల ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేస్తామని తెలిపారు.