తల్లి కడుపులో 9 నెలలు భద్రంగా ఉన్న చిన్నారి.. భూమి మీదకు రాగానే అభద్రతకు లోనైంది. కడుపులో మోసిన తల్లికి లేని బరువు.. పెంచడానికి ఆ తండ్రికి బరువైంది. దాంతో నెలల పసికందు అని కూడా చూడకుండా.. అమ్మకానికి పెట్టాడు. దాంతో పుట్టిన మూడు నెలలకే ఏడుగురి చేతులు మారింది. కూతురుకు దూరమైన తల్లి.. పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేయడంతో చివరకు చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. కేసులో నిందితులుగా తేలిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళగిరి డీఎస్పీ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మనోజ్ దంపతులకు మూడు నెలల కిందట కూతురు పుట్టింది. వారికి అప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. దాంతో చిన్నారిని అమ్మేయాలని మనోజ్ నిర్ణయించుకున్నాడు. తనకు తెలిసిన మిక్కిలి నాగలక్ష్మి సాయంతో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండప్రోలు గ్రామానికి చెందిన మెఘావత్ గాయత్రికి రూ. 70 వేలకు అమ్మేశాడు.
అనంతరం గాయత్రి చిన్నారిని హైదరాబాద్ దిల్ షుక్ నగర్ కు చెందిన భూక్య బాలవర్తి రాజుకు రూ. 1.20 లక్షలకు బేరం పెట్టింది. ఆ తర్వాత బాలవర్తి రాజు రూ. 1,87 లక్షలకు నూర్జహాన్‌కు అమ్మేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన అనుభోజు ఉదయ్ కిరణ్ సాయంతో చిన్నారిని నూర్జహాన్.. చిక్కడపల్లికి చెందిన బొమ్మాడ ఉమాదేవికి రూ. 1.90 లక్షలకు అమ్మేసింది. ఉమాదేవి తన దగ్గరి నుంచి చిన్నారిని విజయవాడ బెంజ్ సర్కిల్‌కు చెందిన పడాల శ్రీవాణికి రూ. 2 లక్షలకు బెరం పెట్టింది.
అక్కడి నుంచి చిన్నారి రూ. 2.20 లక్షలకు విజయవాడలోని గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి వద్దకు చేరింది. అనంతరం విజయలక్ష్మి చిన్నారిని రూ. 2.50 లక్షలకు తూర్పు గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వర్రె రమేష్‌కు అమ్మింది.
ఎట్టకేలకు చిన్నారి ఆచూకి తెలుసుకొని.. గుంటూరు అర్బన్ డీఎస్పీ అరిఫ్ హఫీజ్ సూచన మేరకు చిన్నారిని తల్లికి అప్పగించారు. కేసు విచారణలో పాల్గొన్న పోలీసులకు డీఎస్పీ హఫీజ్ రివార్డు ప్రకటించారు.
Andhra Pradesh | Police bust a newborn child trafficking racket, arrests 11 persons for selling 7 times a three-month-old baby girl in Guntur district pic.twitter.com/RXXHU4UpR5
— ANI (@ANI) March 30, 2022
For More News..