- బీఆర్ఎస్ నేతలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ప్రభుత్వమంతా పక్క రాష్ట్రంలోనే ఉందని మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ తెలంగాణకా, మహారాష్ట్రకా సీఎం అని ఆమె ప్రశ్నించారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో కార్లతో ర్యాలీలు తీసి దుబారా ఖర్చు చేస్తున్నారు. వాళ్ల సోకులను ప్రజలు గమనించాలి. ర్యాలీతో పబ్లిక్ ను సీఎం ఎంతో ఇబ్బంది పెట్టిండు. రాష్ట్రంలో సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్. రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేల్కోవాలి” అని షర్మిల ట్వీట్ చేశారు. రంగులు మార్చే బీఆర్ఎస్ దొంగలను దేశం నుంచి తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
ALSO READ:నా భర్త, పిల్లల్లో ఎవరి రక్తం బొట్టుపడ్డా దానికి కేసీఆరే బాధ్యుడు: జమున
ఎందుకు జైల్లో పెట్టకూడదో కేటీఆర్ చెప్పాలే
సీఎం కేసీఆర్ ను జైలుకెందుకు పంపుతారని అడుగుతున్న మంత్రి కేటీఆర్... ఆయన్ను ఎందుకు జైల్లో పెట్టకూడదో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోపిడీ, టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ, రుణమాఫీపై వెనకడుగు, పోడు పట్టాలు ఇస్తానని ఇవ్వకపోవడం వంటి హామీలు అమలు చేయనందుకు కేసీఆర్ ను జైల్లో పెట్టకూడదా అని ఆమె ప్రశ్నించారు. ప్రజా కోర్టులో తండ్రీకొడుకులకు శిక్షపడి జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు.