జగిత్యాల జిల్లా మాతా శిశు ఆస్పత్రి లో ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్ సోకింది. ఈ నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత సందర్శించి, బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రి (MCH) లో ఆరు గురు గర్భిణీలకు డెలివరీ తర్వాత వేసిన కుట్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో బందువులు ఆందోళనకు దిగారు. ఈ ఇన్ఫెక్షన్ కు కారణం డాక్టర్స్ నిర్లక్ష్యమే కారణమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డెలివరీ అయ్యాక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత కుట్లకు చీము వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు బాధితుల తరపు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
తిరిగి ఆస్పత్రికి వస్తే వైద్యులు పట్టించుకోవడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటన పై స్పందించిన అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత.. ఆస్పత్రికి చేరుకొని బాధితుల ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులకు గురైన బాలింతలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని సంబంధిత డాక్టర్లకు సూచించామన్నారు. సిజేరియన్ అయిన పేషెంట్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రసూతి నుండి తగిన జాగ్రత్తల గురించి గర్భిణులకు హాస్పిటల్స్ సిబ్బంది ద్వారా తెలపాలని డాక్టర్లకు సూచనలు చేశారు.