నడుము సన్నగవ్వాలని..పక్కటెముకలు తీయించుకుంది!

  • అమెరికాలో కాస్మటిక్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ ఉమన్
  • ఆ ఎముకలతో కిరీటం చేయించనున్నట్టు వెల్లడి 

కాన్సాస్ సిటీ(మిస్సోరీ): ఎమిలీ జేమ్స్. అతడి నుంచి ఆమెగా మారిన 27 ఏండ్ల ట్రాన్స్ ఉమన్. అమెరికాలోని మిస్సోరీ స్టేట్ కాన్సాస్ సిటీకి చెందిన ఈమె సోషల్ మీడియాలో మస్త్ పాపులర్. తనను తాను సెక్స్ థెరపిస్ట్ గా కూడా చెప్పుకుంటుంది. 

అయితే, తన నడుము భాగం స్క్వేర్ ఆకారంలో ఉందని, అందుకే దానిని సన్నగా మార్చుకునేందుకు పక్కటెముకలు తొలగించుకున్నట్టు ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. కాస్మటిక్ ప్రొసీజర్ లో భాగంగా డాక్టర్లు తనకు ఒక్కోవైపు నుంచి మూడు చొప్పున పక్కటెముకలను తొలగించారని, ఆ రిబ్స్ ఫొటోలను సైతం ఆమె షేర్ చేసింది. 

ఈ ఆపరేషన్ కు 17 వేల డాలర్లు (రూ. 14 లక్షలు) ఖర్చయినట్టు తెలిపింది. నొప్పిని మేనేజ్ చేసేందుకు డాక్టర్లు మంచి మందులు ఇస్తున్నారని, అలాగే వాపును నివారించేందుకు నడుము చుట్టూ కోర్సెట్ వస్త్రాన్ని ధరిస్తున్నానని వెల్లడించింది. 

ప్రస్తుతం ఈ ఆపరేషన్ నుంచి మెల్లగా కోలుకుంటున్నట్టు పేర్కొంది. తొలగించిన ఆ ఎముకలను ఏం చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. వాటితో ఒక కిరీటం తయారు చేయించాలని భావిస్తున్నట్టు ఎమిలీ చెప్పింది. మొదట వాటిని తన బెస్ట్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నానని, ఇప్పుడు మరిన్ని ఆలోచనలు వస్తున్నాయని తెలిపింది. 

ఇక ఎమిలీ నిర్వాకంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. ‘‘మీ మాంసం రుచిగా ఉంటుందా?’’ అని ఒకరు ప్రశ్నిస్తే.. ‘‘నా మాంసం రుచిగా ఉంటుందనే అనుకుంటున్నా. కానీ నరమాంస భక్షణతో ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి నా ఎముకలను తినను”అని బదులిచ్చింది. అయితే, ‘‘ఎవరేమైనా అనుకోని.. నా డబ్బు. నా శరీరం. నా ఇష్టం. వాటితో ఏమైనా చేసుకుంటా” అని ఎమిలీ గట్టిగా బదులిస్తోంది.