గౌతమ బుద్ధుడి జీవిత ఘట్టాలు..పంచకళ్యాణాలు అంటే ఏంటి.?

గౌతమ బుద్ధుడి జీవిత ఘట్టాలు..పంచకళ్యాణాలు అంటే ఏంటి.?

భారతదేశంలోనూ, ప్రపంచంలోనూ క్రీ.పూ. ఆరో శతాబ్దాన్ని కొత్త మతాలకు, విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చు. ఈ కాలంలో భారతదేశంలో 62 మత శాఖలు ఏర్పడ్డాయి. ఈ 62 మత శాఖల్లో బౌద్ధం ఒకటి. ఈ మత స్థాపన మగధలో జరిగినా పరిపూర్ణ అభివృద్ధి కోసలలో జరిగింది. ఈ మతాన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. ఈయన అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుని జీవిత చరిత్రకు జాతక కథలు, సుత్తనిపాతం, దీపవంశ, మహావంశ అనే సింహళ బౌద్ధ గ్రంథాలు బౌద్ధమత మూల గ్రంథాలైన త్రిపీటకాలు, మహావస్తు, లలిత విస్తారం, బుద్ధ చరితం, దిఘని నికాయ, నిదన కథ, అభినిష్క్రమణ సూత్ర ప్రామాణిక గ్రంథాలుగా పరిగణిస్తారు. బుద్ధుడి జీవితకాలంలో కనిపించే ఐదు జీవిత ఘట్టాలైన జననం, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్వాణాలను పంచకళ్యాణాలు అంటారు. 

జననం

బుద్ధుని తల్లి మహామాయకు అనతప్త అనే దైవ సరస్సు ఒడ్డున ఆరు తెల్ల దంతాలు గల తెల్ల ఏనుగు కమలం పువ్వు ఇచ్చినట్లు  కల వచ్చింది. సిద్ధార్థుడు నేపాల్​లోని లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్​ వృక్షం కింద జన్మించాడు. సిద్ధార్థుడి జననాన్ని కమలం పువ్వుతో సూచిస్తారు. కమలం పువ్వును గొప్ప కుమారుడి పుట్టుకకు గుర్తుగా భావిస్తారు. సిద్ధార్థుడిని అశితుడు అనే హిమాలయ యోగి మొట్టమొదటగా సందర్శించాడు. ఇతడు తన శిష్యుడైన మహాకాశ్యపుడిని భవిష్యత్తులో బుద్ధుని వద్ద శిష్యరికం చేయమని ఆదేశించాడు. 

మహాభినిష్క్రమణ 

సిద్ధార్థుడు తన రథసారథి చెన్నడుతో కలిసి కపిలవస్తు నగర సందర్శనకు(వ్యాహ్యాళి) వెళ్లినప్పుడు ముసలివాడు, రోగి, శవం, సన్యాసి అనే నాలుగు విషయాలు చూశాడు. నగర సందర్శనలో చూసిన పై విషయాల నుంచి సిద్ధార్థుడు ప్రేరణ పొంది, తన 29 సంవత్సరాల వయస్సులో(వైశాఖ శుద్ధ పౌర్ణమి) జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ విధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటారు. మహాభినిష్క్రమణను గుర్రం(కంటక)తో సూచిస్తారు. జ్ఞాన సముపార్జన కోసం సిద్ధార్థుడు ఆరు సంవత్సరాల పాటు సంచార జీవనం గడిపాడు, ఇతను మొదట అలార కలామ(వైశాలి), ఉద్దక రామపుత్త (రాజగ్రిహ)ల దగ్గర వరుసగా సాంఖ్య, యోగాభ్యాసం గురించి నేర్చుకున్నాడు. సిద్ధార్థుడు ఉపనిషత్తుల వల్ల చాలా ప్రభావితమైనప్పటికీ ఇతనికి కావాల్సిన సమాధానం లభించలేదు.

జ్ఞానోదయం

సిద్ధార్థుడు గయలోని నిరంజన నది లేదా ఫల్గు నది(ప్రస్తుతం లీలాజన్​నది) ఒడ్డున రావివృక్షం కింద  49 రోజులపాటు ధ్యానం చేసి 35వ ఏట వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందాడు. దీంతో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత సంబోది లేదా తథాగతుడు అయ్యాడు. ఈ ధ్యానాన్ని భంగం చేయడానికి మార అనే రాక్షసుడు ప్రయత్నించాడు. 

ధర్మచక్ర పరివర్తనం

జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్​లోని జింకలవనంలో ఐదుగురికి మొదటి బోధన చేశాడు. మొదటి బోధననే ధర్మచక్ర పరివర్తనం అంటారు. ఈ ధర్మ చక్ర పరివర్తనానికి ఎనిమిది పుల్లలు ఉన్న చక్రంతో సూచిస్తారు. ఈ ఎనిమిది పుల్లలే అష్టాంగమార్గాన్ని సూచిస్తాయి. పరివర్తనానికి గుర్తింపుగా గురు పూర్ణిమ అనే పండుగను జరుపుకుంటారు. ఈ ధర్మచక్ర పరివర్తనాన్ని విన్న మొదటి ఐదుగురు శిష్యులు కొండన్న, తిప్ప, బోదియ, అస్సగి, మహానా.

 మహాపరినిర్వాణ

బుద్ధుడు తన 80వ ఏట వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు. వర్షాకాలం అనంతరం వైశాలి నుంచి పావాపురి అనే గ్రామానికి వెళ్లాడు. పావాపురి గ్రామంలో సుండ కమ్మరిపుత్త ఆతిథ్యం స్వీకరించి పంది మాంసం, బియ్యపు పిండి రొట్టెలు తిని అస్వస్థతకు గురయ్యాడు. అక్కడి నుంచి కుషినగరానికి వెళ్లి వైశాఖ శుద్ధపౌర్ణమి నాడు సాల్​వృక్షం కింద మరణించాడు. దీనినే మహాపరి నిర్వాణ అంటారు. మహాపరి నిర్వాణాన్ని స్తూపంతో సూచిస్తారు. గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఆనందుడు, సుభద్రుడితో మాట్లాడాడు. ఈ చివరి ఉపదేశంలో ధర్మం శాశ్వతమని, అది ముక్తికి మార్గమని ఉపదేశించాడు. బుద్ధుడి మరణానంతరం అతడి అనుచరులు బుద్ధుని అస్థికలను దేశంలోని నలువైపులా తీసుకెళ్లి పూడ్చిపెట్టి వాటిపైన స్తూపాలు నిర్మించారు.

ALSO READ | ఒక్క ఎగ్జామ్ తో NII జూనియర్ అసిస్టెంట్​ ఉద్యోగాలు