కృత్రిమ జన్యు సృష్టికర్త.. హరగోబింద్​ ఖొరాన

కృత్రిమ జన్యు సృష్టికర్త.. హరగోబింద్​ ఖొరాన

మానవ జీవితాన్ని ఆదిమకాలం నుంచి విజ్ఞానం, సాంకేతికత ఎంతో ప్రభావితం చేస్తాయి. నాగరికతలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందడంలో శాస్త్రవేత్తల పాత్ర ముఖ్యమైంది. ప్రతి రంగంలోనూ శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలతో మానవుల జీవితాన్ని సుఖవంతం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రాచీనకాలం నాటి శుశ్రుత నుంచి నేటి సర్​ సి.వి.రామన్​ వరకు కనిపెట్టిన అంశాలు విజ్ఞానశాస్త్రంలో భారతదేశాన్ని మిగిలిన దేశాల కంటే అగ్రస్థానంలో నిలిపిందనడంలో సందేహం లేదు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలపై అవగాహన అందించాలనే ఉద్దేశంతో భారతీయ శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. 

ఎల్లాప్రగడ సుబ్బారావు: ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. ఎల్లాప్రగడ సుబ్బారావుకు అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని ప్రసిద్ధి. ప్లేగువ్యాధికి నివారణగా ఉపయోగపడే ఆరియోమైసిన్​(టెట్రాసైక్లిన్​) అనే యాంటి బయాటిక్​ను కనుగొన్నాడు. ఈయన గౌరవార్థం ఒక శిలీంధ్రం(ఫంగస్​)కు సుబ్బరోమైసిన్​ స్పెండెన్స్​ అని నామకరణం చేశారు. 
హరగోబింద్​ ఖొరాన: అవిభక్త భారతదేశంలోని పంజాబ్​ రాష్ట్రంలో జన్మించారు. వంశపారంపర్యంగా సంక్రమించే జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జన్యువుని సృష్టించారు. ఇందుకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్​ బహుమతి అందుకున్నారు. 

జగదీశ్ చంద్రబోస్​: మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవీ భావాలను వ్యక్తం చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త జగదీశ్​ చంద్రబోస్​. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే కెస్మోగ్రాఫ్​ అనే పరికరాన్ని కనుగొన్నాడు. ఈయన రేడియో, మైక్రోవేవ్​ ఆప్టికల్స్​తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాన్ని సాధించారు. ఈయనకు రేడియో సైన్స్​ పితామహుడు అని కూడా పిలుస్తారు. ఈయన గౌరవార్థం చంద్రుడిపై ఉన్న ఒక బిలానికి బోస్​ పేరు పెట్టారు. 

ఎంఎస్​ స్వామినాథన్​: ఈయన తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ప్రముఖ భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, ఈయన్ని భారతదేశపు హరిత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. స్వామినాథన్​ ఫౌండేషన్​ రీసెర్చ్​ను స్థాపించారు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను పరిచయం చేశారు. ప్రతిష్ఠాత్మక రామన్​ మెగసెసె అవార్డు, శాంతి స్వరూప్​ భట్నాగర్​​ అవార్డు, పద్మభూషణ్​ పురస్కారం అందుకున్నారు.

వర్గీస్​ కురియన్​: ఈయన్ని మిల్క్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియా, శ్వేత విప్లవ పితామహుడిగా పిలుస్తారు. దేశంలో పాల ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడానికి విశేష కృషి చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఇండియన్​ డైరీ అసోసియేషన్​ నవంబర్​ 26న జాతీయ పాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్​ పురస్కారంతో సత్కరించింది. 
బీర్బల్​ సహాని: భారత ఉపఖండంలో శిలాజాలను అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త. భూగర్భశాస్త్రం, పురావస్తుశాస్త్రంలో విశేష ప్రతిభ కనబర్చారు. 1964లో లక్నోలో బీర్బల్​ సహాని ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పాలియోబోటనీని స్థాపించారు. రాయల్​ సొసైటీ ఆఫ్​ లండన్​కు ఎంపికయ్యారు. వృక్షశాస్త్ర విద్యార్థులకు బీర్బల్​ సహాని గోల్డ్​ మెడల్​ ఇతని జ్ఞాపకార్థం స్థాపించారు. 

సలీం అలీ: ముంబైలో జన్మించిన విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ. ఈయన బర్డ్​ మ్యాన్​ ఆఫ్​ ఇండియాగా ప్రసిద్ధి. దేశంలో పక్షిశాస్త్రం(ఆర్నిథాలజీ) గురించి అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం అలీ కృషి మరువలేనిది. బాంబే నేచురల్​ హిస్టరీ సొసైటీ, భరత్​పూర్ పక్షుల అభయారణ్యం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. పాల్​గెట్టి అవార్డుతోపాటు పద్మభూషణ్​, పద్మ విభూషణ్​ పురస్కారాలు అందుకున్నారు. ఈయన ఆత్మకథ ది ఫాల్​ ఆఫ్​ స్వారో .

సర్​ సి.వి.రామన్​: చంద్రశేఖర్ వెంకటరామన్​ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన కాంతి వికీర్ణంపై ప్రయోగాలు చేసి 1928, ఫిబ్రవరి 28న రామన్​ ఎఫెక్ట్​ను కనుగొన్న రోజు దీనికి గుర్తుగా భారత ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్​ దినోత్సవాన్ని జరుపుతున్నది. 1930లో ఈయన చేసిన పరిశోధనలకు నోబెల్​ బహుమతి లభించింది. రామన్​కు ప్రభుత్వం 1954లో భారతరత్నతో సత్కరించింది. 

ప్రఫుల్ల చంద్ర రే: ఈయన్ని భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. దేశంలో మొదటి ఫార్మాసూటికల్స్​ కంపెనీ బెంగాల్​ కెమికల్స్​ అండ్​ ఫార్మాసూటికల్స్​ను స్థాపించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు మేఘనాత్​ సాహా, శాంతిస్వరూప్​ భట్నాగర్​ ఈయన శిష్యులే. 

మేఘనాథ్​ సాహా: భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం వంటి ఎన్నో ధర్మాలను ఆవిష్కరించి కనుగొన్నారు. ఈయన 1952లో కోల్​కత్తా నుంచి పార్లమెంట్​కు ఎన్నికయ్యారు. సాహా సౌర కిరణాల జరువు, పీడనాన్ని కొలవడానికి పరికరాన్ని  కనిపెట్టారు. 

సుబ్రమణ్యన్​ చంద్రశేఖర్​: ఈయన పేరొందిన నక్షత్ర భౌతికశాస్త్ర పరిశోధకులు, గణిత శాస్త్రవేత్త. ఈయన భౌతికశాస్త్రంలో కృష్ణబిలాల గణిత సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఇందుకు 1983లో నోబెల్​ బహుమతి అందుకున్నారు. 

శ్రీనివాస్​ రామానుజన్​: ఈయన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. డిసెంబర్​ 22న శ్రీనివాస్​ రామానుజన్​ జన్మదినాన్ని గణిత దినోత్సవంగా జరుపుతారు. 1729ను రామానుజన్​ సంఖ్యగా పిలుస్తారు. రామానుజన్​ 3900 గణితశాస్త్ర సమీకరణాలను పరిష్కరించారు. 

శాంతిస్వరూప్​ భట్నాగర్​: ఈయన్ని పరిశోధనా శాలల పితామహుడిగా పిలుస్తారు. రసాయనశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. ఎమల్షన్​పై అధ్యయనం చేశారు. సెలీనియం మూలకాల పరమాణుతత్వాన్ని కనుగొన్నారు. దేశంలో విజ్ఞానశాస్త్రం పరిశోధనలకు నాందిగా నిలిచిన సీఎస్​ఐఆర్​ స్థాపనలో విశేష కృషిచేశారు. యూనివర్సిటీ గ్రాట్స్​ కమిషన్​ మొదటి చైర్మన్​గా పనిచేసి దేశంలో ఉన్నత విద్య పురోభివృద్ధికి తోడ్పడ్డారు. 

ఏపీజే అబ్దుల్​ కలాం: ఈయన్ని భారతదేశపు మిస్సైల్​ మ్యాన్​గా పిలుస్తారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనేక పరిశోధనలు చేశారు. ఇస్రో, డీఆర్​డీవో సంస్థల పురోభివృద్ధికి శ్రమించారు. భారతదేశ మొదటి లాంచ్​ వెహికిల్​ ఎస్​ఎల్​వీ–III, బాలిస్టిక్​ మిస్సైల్స్​ రూపకల్పనలో ఈయన పాత్ర వెలకట్టలేనిది. 1998లో పోఖ్రాన్​లో నిర్వహించిన అణుపరీక్షలు విజయవంతం  కావడంలో అబ్దుల్​ కలాం పాత్ర ఉంది.  

హోమీ జహంగీర్​ బాబా: భౌతిక శాస్త్రవేత్త. టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫండమెంటల్​ రీసెర్చ్​ సంస్థకు వ్యవస్థాపక డైరెక్టర్​గా వ్యవహరించారు. ఈయన్ని భారత అణుశాస్త్ర పితామహుడిగా వ్యవహరిస్తారు. అటామిక్​ ఎనర్జీ ఎస్టాబ్లిష్​మెంట్​ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థను బాబా అటామిక్​ రీసెర్చ్​ సెంటర్​గా పిలుస్తారు. భారత ప్రభుత్వం పద్మభూషణ్​ పురస్కారంతో సత్కరించింది. 

విక్రమ్​ సారాబాయి: ఈయన్ని భారత అంతరిక్ష పితామహుడిగా పిలుస్తారు. భారత అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు ఆద్యుడు. ఇస్రో ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించారు. అంతరిక్షంలో కాస్మిక్​ కిరణాల గురించి ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయ నక్షత్ర సమాఖ్య చంద్రునిపై ఉన్న ఒక బిలానికి ఈయన పేరు పెట్టింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్​, పద్మ విభూషణ్​తో సత్కరించింది. 
ఎ.వి. సుధాకర్, స్కూల్​ అసిస్టెంట్​, లింగంపల్లి (మంచాల) రంగారెడ్డి జిల్లా