మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రికార్డుల డిజిటలైజేషన్‌తో సెక్షన్ల వ్యవధిలో కావల్సిన సమాచారాన్ని పొందవచ్చని కలెక్టర్ ఎస్.వెంకట్ రావు చెప్పారు. జిల్లాలోని రికార్డు రూమ్‌ను వందశాతం డిజిటలైజేషన్ చేసి జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ అవార్డు కోసం దరఖాస్తు చేయగా.. మంగళవారం కేంద్ర స్పాట్ స్టడీ టీం మెంబర్స్ పరిశీలించారు. రికార్డ్ రూమ్ కంప్యూటరైజేషన్‌లో భాగంగా 70వేల డాక్యుమెంట్లను, 50 లక్షల పేజీలను స్కానింగ్ చేసి అన్ లైన్‌లో ఉంచామని కలెక్టర్ వారికి వివరించారు. వీరి సమక్ష్యంలోనే మూసాపేట మండలం జానంపేటకు చెందిన అనంత చారి తన భూమి వివరాలు కోరగా.. అప్పటికప్పుడే ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ ఎంవీఎన్ వరప్రసాద్, పౌర సరఫరాల శాఖ అండర్ సెక్రటరీ భవనాన్ సింగ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఐవో ఎంఎస్ ఎన్ మూర్తి, బిఎన్ఆర్ ఉద్యోగ్ ప్రతినిధులు సతీశ్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
మహిళల హక్కులు కాపాడాలి
వనపర్తి, వెలుగు: మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాల కార్మిక నిర్మూలన పక్కాగా అమలవుతోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలంటే కిశోర బాలికలు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటోందని, వారిని గుర్తించి పౌష్టికాహారం తీసుకునేలా చూడాలని అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, డీడబ్ల్యూవో పుష్పలత పాల్గొన్నారు.
పాముకాటుతో రైతు మృతి
లింగాల, వెలుగు : పాముకాటుతో రైతు మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. లింగాల మండలం పద్మనపల్లికి చెందిన ముడవత్ గోబ్రియా (52) సోమవారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పంటకు కాపలాగా పడుకున్నాడు. రాత్రి సమయంలో పాము కాటువేయడంతో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వాళ్లు స్థానికుల సాయంతో నాగర్ కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. గోబ్రియకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
అప్పంపల్లిలో మహిళ..
మరికల్, వెలుగు : నాలుగు రోజుల క్రితం పాముకాటుకు గురైన మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన మణెమ్మ(46) మంగళవారం మృతి చెందింది. ఎస్సై అశోక్‌బాబు వివరాల ప్రకారం.. మణెమ్మ ఎప్పటిలాగే తన ఇంట్లో గురువారం రాత్రి భోజనం చేసి పడుకుంది. శుక్రవారం తెల్లవారు జామున ఎదో కరిచినట్లు అనిపించగా.. కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లు లేచి చూడగా పాము కనిపించింది. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం చెందింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇరిగేషన్ పనుల్లో జాప్యం వద్దు
వనపర్తి, వెలుగు: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇరిగేషన్ పనుల పురోగతి వివరాలపై రిపోర్టు ఇవ్వాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ సత్యశీలా రెడ్డి, ఈఈ మధుసూధన్, డీఈలు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సీఎంఆర్‌ఎఫ్‌తో పేదల ప్రజల వైద్యానికి భరోసా ఇస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 115 మంది లబ్ధిదారులకు రూ. 33 .14 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఫుడ్పార్క్తో ఉపాధి
మహబూబ్‌నగర్, వెలుగు : హన్వాడలో ఏర్పాటు చేస్తున్న ఫుడ్ పార్క్‌తో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంగళవారం హన్వాడ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ పార్క్ కోసం అవసరమైన 350 ఎకరాల భూ సేకరణలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రైతుల నుంచి సేకరించే భూమికి భూమినే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో బోయపల్లి, మోతీనగర్‌కు చెందిన దాదాపు 500 మంది పార్టీలో చేరగా.. మంత్రి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, హన్వాడ ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయ నిర్మల పాల్గొన్నారు.
రైతు సమస్యలకు రైతుబంధు పరిష్కారం కాదు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రైతు సమస్యలకు రైతుబంధు పరిష్కారం కాదని, ప్రభుత్వం ఒక పక్క రైతుబంధు అమలు చేస్తూ మరో పక్క సబ్సిడీలు ఎత్తివేసిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం డీసీసీ ఆఫీసులో జిల్లా కిసాన్ కాంగ్రెస్ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి రైతు సమస్యల పరిష్కారంలో కీలకంగా పనిచేస్తున్న కిసాన్ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని సూచించారు. వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో కిసాన్ సెల్‌తో కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, ఉపాధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ కార్యదర్శులు జీ.మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ గౌడ్, మీడియా కన్వీనర్ సీ జే బెనహర్ , మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గౌస్, నాగరాజు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయాలి
లేదంటే ఆమరణ దీక్ష చేస్త
కల్వకుర్తి, వెలుగు: చారకొండ మండలంలోని గోకారం రైతులకు న్యాయం చేయాలని, లేదంటే ఆమరణ దీక్ష చేస్తానని టీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బాధిత రైతులు గోకారం రిజర్వాయర్ రద్దు చేసి చెరువును పునరుద్ధరించాలని చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గోకారం చెరువును ఒక టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. 450 ఎకరాల భూమిని కూడా సేకరించిందని, పరిహారం మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రిజర్వాయర్‌తో రెండు గ్రామాలతో పాటు వందల ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తోందని వాపోయారు. చెరువు పూర్తిగా నిండితే 500 ఎకరాలు సాగవుతాయని చెప్పారు. అనంతరం చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ కాంట్రాక్టర్ స్వలాభం కోసం రిజర్వాయర్ నిర్మించడం సరికాదన్నారు. రైతుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ స్పందించి, మూడు నెలలలో రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే గోకారం రిజర్వాయర్ వద్దే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.
లోన్లు ఇన్ టైంలో ఇవ్వాలి
గద్వాల, వెలుగు: బ్యాంకర్లు అందించే వివిధ రకాల లోన్లను ఇన్ టైంలో ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్ సరితతో కలిసి వివిధ కార్పొరేషన్ లోన్లు, ప్రభుత్వ స్కీముల అమలు తీరుపై బ్యాంకర్లతో డీసీసీబీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఇచ్చే క్రాప్ లోన్లు, స్టూడెంట్లకు ఇచ్చే ఎడ్యుకేషన్ లోన్లు, ఉపాధి కోసం ఇచ్చే కార్పొరేషన్ లోన్ల విషయం లేట్ చేయవద్దన్నారు. సబ్సిడీ రుణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ అప్లికేషన్లు వచ్చేలా చూడడం బ్యాంకర్ల బాధ్యతేనన్నారు. మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలతో పాటు ప్రభుత్వ స్కీమ్స్ కింద చిన్న వ్యాపారస్తులకు ఇస్తున్న లోన్ టార్గెట్‌ను 100 శాతం చేరుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, అబ్రహం, ఎల్‌ఎండీ అయ్యప్ప రెడ్డి పాల్గొన్నారు.
పేరుకే నీళ్ల నిరంజన్‌రెడ్డి
- పాత పథకాలే తప్ప కొత్తగా ఎకరాకు కూడా నీళ్లియ్యలే
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి
పెబ్బేరు, వెలుగు: వ్యవసాయ శాఖ మంత్రి పేరుకే నీళ్ల నిరంజన్‌రెడ్డి అని, పాత పథకాల అమలే తప్ప కొత్తగా ఎకరాకు కూడా నీళ్లిచ్చింది లేదని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి విమర్శించారు. ‘ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా మంగళవారం మండలంలోని రంగాపూర్, బునియాదిపూర్, జానంపేట, వెంకటాపూర్, శేర్ పల్లి, కిష్టారెడ్డిపేట, చెలిమిల్ల, పెబ్బేరు టౌన్, రాంపూర్, శాఖాపూర్(వై), మాలపల్లి మీదుగా పెబ్బేరు టౌన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పిన మంత్రి తాను అభివృద్ధి చెందారే తప్ప జిల్లాను పట్టించుకోలేదని మండిపడ్డారు. పాలమూరులోని ప్రాజెక్టుల పనులు వైఎస్సార్ హయాంలో 80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులకు ఎస్టిమేషన్లు వేసి కమీషన్లు తిన్న ఘనత ఇక్కడి మంత్రులకే దక్కిందని ఆరోపించారు. రెండున్నరేళ్లలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. పెబ్బేరుకు యూనివర్సిటీలు తీసుకొచ్చి విద్యాహబ్‌గా చేస్తామన్న మాటలు ఎక్కడికి పోయాయన్నారు. వేణుగోపాల స్వామి టెంపుల్ చెందిన 32 ఎకరాలు, చెలిమల్లలో వివిధ వర్గాలకు చెందిన భూములను అధికార పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. పీజేపీ కెనాల్స్‌కు సైడ్‌వాల్స్ లేక పిల్లలు చనిపోతున్నారని వాపోయారు. మండలంలో 20 గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదన్నారు. స్కూళ్లలో పిల్లలకు పుస్తకాలు లేవని, పురుగులఅన్నం తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కిష్టారెడ్డి ప్రభుత్వ స్కూల్‌కు రిపేర్లు కూడా చేయించడం లేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో సీసీఐ సెంటర్, జడ్చర్ల - మహబూబ్‌నగర్ మధ్య హైవే, పాస్ పోర్టు ఆఫీసులను కేంద్రమే మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, నేతలు ప్రభాకర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, హేమా రెడ్డి, రామన్‌గౌడ్, ఆంజనేయులు, రాంబాబు, తిరుమలేశ్, రంగ గౌడ్, బుడ్డన్న, ప్రవీణ్ పాల్గొన్నారు.